CHANDRABABU ON AP GOVT : రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం ఏపీలో నిత్యం ఏదో చోట రైతులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ సహాయం, పంటలకు కనీస మద్దతు ధర లేక వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఆవేదన చెందారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా.. అన్నదాతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.
కౌలు రైతుల సంక్షేమం మరిచారు..
TDP PRESIDENT CHANDRABABU NAIDU : ఏపీలో 93 శాతం మంది రైతులు అప్పుల్లో మునిగిపోయారని చంద్రబాబు చెప్పారు. రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చారని వైకాపా పాలనపై ధ్వజమెత్తారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో అమలుచేసిన రైతు రుణమాఫీని వైకాపా సర్కార్ రద్దు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్న చంద్రబాబు... కనీస మద్ధతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పీవీకి నివాళులు..
తన సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జయించి, దేశాన్ని అంతర్జాతీయ పోటీకి సిద్ధం చేసిన పాలనా సమర్థులు పీవీ నరసింహారావు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. వ్యక్తి ఉన్నా లేకపోయినా దేశం, జాతి శాశ్వతంగా నిలవాలని భావించి, ఆ దిశగా కృషిచేసిన పీవీ వర్ధంతి సందర్భంగా.. ఆయన స్మృతికి చంద్రబాబు నివాళులర్పించారు.
రైతు లేని రాష్ట్రంగా మార్చేశారు..
NARA LOKESH : రైతు రాజ్యం తెస్తానన్న జగన్.. రైతులేని రాష్ట్రంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు లోకేశ్. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. నచ్చిన పంట వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదంటే.. రైతాంగం ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందో అర్థమవుతోందన్నారు. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి.. రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
ఇదీ చూడండి: Niranjan Reddy Comments: 'ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చామా..?'