ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu)అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ఏపీ వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిరసన చేపట్టిన చంద్రబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రతిబింబం అని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమిది అని చెప్పారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. పట్టాభి ఇంటిపైనా దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతో పాటు చాలా చోట్ల దాడులు జరిగాయి. తెదేపా కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదు. నా ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు. దాడుల గురించి వివరించేందుకు డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించరా?మనపైనే కాదు.. ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు.
పోలీసులు స్పందించకుంటే నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయి. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు నమోదు చేస్తారా?పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు. జగన్, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా?విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం’’ అని చంద్రబాబు అన్నారు.