Tarakaratna Final Rites Ends in Mahaprasthanam: జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. శనివారం తారకరత్న కన్నుమూయగా.. సోమవారం సాయంత్రం నందమూరి కుటుంబసభ్యులు, నారా కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. నందమూరి బాలకృష్ణ సహా కుటుంబసభ్యులు తారకరత్న పాడె మోశారు. వైకుంఠ రథంలో తారకరత్న భౌతికకాయం వెంట చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉన్నారు. అంతిమ సంస్కారాలను తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ నిర్వహించారు. చితికి నిప్పంటించి ఆఖరి కార్యక్రమాలను పూర్తిచేశారు.
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన తారకరత్న అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యణ్రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫిలిం ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
గుండెపోటుకు గురై... 23 రోజుల పాటు బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న ఆఖరి చూపు కోసం సినీ,రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు తరలివచ్చారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహానికి నందమూరి కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు.... తారకరత్నకు నివాళులు అర్పించారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న వారంతా ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
చివరి చూపు కోసం తరలివచ్చిన నందమూరి అభిమానులు : తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి సహా పలువురు రాజకీయనాయకులు నివాళులర్పించారు. బాలకృష్ణ, వెంకటేశ్, సురేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ దంపతులు, ఆదిశేషగిరిరావు, శివాజీ, తరుణ్ తదితరులు తారకరత్న పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అభిమానులు సైతం తారకరత్న చివరి చూపు కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. వేలాది మంది నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు తరలిరాగా ఫిల్మ్ ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. తారకరత్న అమర్ రహే అంటూ అభిమాన నటుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు.
ఇవీ చదవండి: