సంగీత ప్రపంచంలో మరుగునపడ్డ 50 మంది సంగీత విద్వాంసుల గొప్పతనాన్ని వివరిస్తూ ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి తెలుగులో రచించిన ఎందరో మహానుభావులు పుస్తకం ఆంగ్లంలోకి అనువాదించడం ఎంతో ఆనందంగా ఉందని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాదరెడ్డి అన్నారు. నేటి తరానికి పది మంది సంగీత విద్వాంసులు కూడా తెలియడం లేదని, అలాంటి వారి విశేషాలతో కూడిన రచన ఆంగ్లంలోకి అనువదించడం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సాధిస్తుందన్నారు.
ఎందరో మహానుభావులు రచనను సత్య భావన ఆంగ్లంలోకి అనువదించగా అన్విష్కీక పబ్లిషర్స్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో వరప్రసాద్ రెడ్డితోపాటు తనికెళ్ల భరణి, దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అతిథులు... ఎందరో మహానుభావులు పుస్తకం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
అజ్ఞాతంగా మిగిలిపోయిన మహా స్రష్ఠలు, వాళ్లు సంగీత మునులు, రుషులు వాళ్లను వెలికితీసుకొచ్చి పదిమందికి పరిచయం చేస్తే మంచిదనే అభిప్రాయంతోని తనికెళ్ల భరణి ఈ యజ్ఞాన్ని సంకల్పించి చేశారు. ఆయన సంకల్పం నెరవేరింది.
-- వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు
ఈ పుస్తకంలో 51 మంది జీవిత చరిత్రలు ఒక్కచోట దొరికితే అంతకన్న అదృష్టం ఏముంటుంది యువతరానికి. సత్య భావన చేసిన ఈ తర్జుమా విశ్వవ్యాప్తంగా పరిచయం చేస్తున్న గొప్ప అవకాశం.
-- సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ
ఇది సంగీత విద్యాంసుల కథ కాదు.. వాళ్లను ఏలిన రాజులు, ఆ రాజ్యాలు, సామంత రాజ్యాలు వాళ్లకు ఉండే ప్రెషర్స్, టెన్షన్స్, ఒక కళను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో వాళ్లు పడ్డ శ్రమ, తపన అవన్నీ కూడా ఈ పుస్తరంలో కనిపిస్తాయి.
-- సత్యభావన, రచయిత
ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఈ తెలుగు తేజాలు, సంగీత మహానుభావులు... వాళ్ల కృషి అంటే ఒక్కొక్క జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. అంటే సంగీతం కోసం జీవితాల్ని ఫణంగా పెట్టారా అనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన సంఘటనల కూర్పు ఈ పుస్తకం.
-- తనికెళ్ల భరణి, సినీనటుడు
ఇదీ చూడండి: 'చెట్లకు రాఖీ: మొక్కల రక్షణ.. భవిష్యత్ తరాలకు భరోసా'