ప్రతి తల్లి తమ పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పిల్లలకు సరిపడ పౌష్టికాహారం లభిస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు.
రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో 'రాజ్‌భవన్ అన్నం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి సహకారంతో ప్రతి రోజూ ఉదయం రాజ్ భవన్ పాఠశాలలో చదివే విద్యార్థులకు, రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బంది, చుట్టుపక్కల ఉండే పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు.
ఉదయాన్నే అల్పహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాజ్‌భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్న గవర్నర్... విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులను పేరుపేరునా పలకరించి నిత్యం అల్పాహారం తీసుకోవాలని కోరారు.