Talasani Srinivas on Nandi Awards: హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు.
ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరు: సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సర్కారుకు ప్రతిపాదన పంపలేదని తలసాని తెలిపారు. బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించలేదని పేర్కొన్నారు. పురస్కారాలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా.. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమకు ఏ ఆటంకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుందన్నారు.
నంది అవార్డులు ఆపేసిన మాట వాస్తవమే: సినీ పరిశ్రమకు సహకారం విషయంలో ప్రభుత్వాన్ని చాలాసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు అనుమతి, ఐదో షో ఆటకు అనుమతి సహా అనేక రకాలుగా సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డులు ఆపేసిన మాట వాస్తవమేనన్న ఆయన.. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని ప్రకటించారు.
'దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకు ఏ ఆపద వచ్చినా ముందడుగు వేసిన వ్యక్తి దాసరి. దాసరి చిత్రాలు మంచి సందేశాత్మకంగా ఉండేవి. దాసరి మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో కృషి చేశారు.'-తలసాని శ్రీనివాస్ యాదవ్, సినిమాటోగ్రఫీ మంత్రి
ఇదీ వివాదం..: ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ చేయనున్న నేపథ్యంలో నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదని, ఇప్పుడు తన ఉద్దేశంలో ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఎవరి పేరూ ఎత్తకుండా మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించడం గమనార్హం.
ఇవీ చదవండి: