Kalasiguda Nala Incident: ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని విపక్షాలకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. కళాసిగూడ నాలా ఘటన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు చేసే విమర్శలు వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. హైదరాబాద్ కళాసిగూడలో చిన్నారి మౌనిక కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ.5 లక్షల చెక్కును మౌనిక తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా చనిపోయిన అమ్మాయిని తిరిగి తీసుకురాలేమని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ధర్మం ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి మౌనిక నివాసానికి వెళ్లి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఈ సాయం కాకుండా బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా సర్కారు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
చిన్నారి మౌనిక మృతి.. బాధిత కుటుంబాన్ని కలచి వేయడమే కాక.. యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. మౌనిక ఉదంతం నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అన్ని సందర్భాల్లో అండగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌లో నాలాలను అభివృద్ధి చేశాక నగరంలో వరద ముప్పు కొంత మేర తగ్గిందని.. అయినప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా.. వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, పురపాలక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.
"చిన్నారి మృతి ఆ కుటుంబాన్ని కలచి వేయడమే కాకుండా సమాజాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన అమ్మాయిని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కనీసం ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ధర్మం ప్రభుత్వంపై ఉంది. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. చిన్నారి మౌనిక ఉదంతం నేపథ్యంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం తగదు. ఈ విషయంలో వారి విమర్శలను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నాను". - తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక శాఖ మంత్రి
ఇవీ చదవండి:
- Gamblers Arrest: థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు అరెస్టు.. నిందితుల్లో చీకోటి ప్రవీణ్
- ఆస్పత్రిలో నాన్న.. దిగులుతో కుమారుడు మృతి.. షాక్‌లో తండ్రి కూడా..
- Job Fraud: డేటా ఎంట్రీ జాబ్ ఇస్తామంటూ.. నిరుద్యోగులకు టోకరా
- Police surveillance of ganja: రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీసుల ప్రత్యేక నిఘా..