Congress Focus on Telangana Assembly Elections : మరో మూడ్నెళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే చేరికలు, బహిరంగ సభలు, అధికార పార్టీపై ఎదురుదాడితో జోష్ మీదున్న హస్తం పార్టీ నేతలు... ఇదే ఊపును ఎన్నికల దాకా కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర కీలక నేతలంతా భేటీ అయ్యారు.
T Congress Meeting at MP Komatireddy House : మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగిన ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇతర పార్టీల నుంచి వరుసగా నేతల చేరికలు పెరిగినందున... ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు, అగ్రనేతల పర్యటనలు, ఎన్నికల హామీలు, ఇతర కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే నేతలంతా ఉమ్మడిగా బస్సు యాత్ర చేపట్టే విషయంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Komatireddy Venkatreddy fires on CM KCR : కర్ణాటకలో మాదిరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలహాలు మాని కలిసి పనిచేయాలని సీనియర్ నేతలు నిర్ణయించారు. భేటీ అనంతరం చర్చకు వచ్చిన అంశాలను ఎంపీ వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు మీడియాకు తెలియజేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పదని జోస్యం చెప్పారు. ఈ నెలాఖరులో జరిగే బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నాయకులంతా ఉమ్మడిగా జరిపే బస్సు యాత్రపై పీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఐక్యంగానే ఉన్నారనే మెసేజ్ ఇచ్చామని... వచ్చే ఎన్నికల ఆక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని తెలిపారు.
'కేసీఆర్ కుటుంబం ప్రగతిభవన్ ఖాళీ చేయక తప్పదు.కేటీఆర్‌ను కాకుండా.. బీసీని సీఎంగా కేసీఆర్ చేస్తారా? బీసీలకు కాంగ్రెస్‌ను మించి న్యాయం చేసిన పార్టీ లేదు. బీసీని పీసీసీగా చేసింది కాంగ్రెస్సే. కేటీఆర్ నిరసనలకు పిలుపునిస్తే ఎవరూ రావట్లేదు. సాగుకు 8 గంటలు మించి కరెంట్ ఇవ్వట్లేదని రైతులకు తెలుసు. నేను లాగ్‌బుక్స్ తీసి నిలదీశాక కొంచెం ఎక్కువసేపు ఇస్తున్నారు.'-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
బీసీలను రేవంత్ రెడ్డి ఏమనలేదు : కేసీఆర్ మాదిరిగా ఇష్టమొచ్చిన హామీలిచ్చి మోసం చేయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశంలో చర్చించిన విషయాలు చెబితే నాలుగు నెలల తర్వాత ఖాళీ కావాల్సిన ప్రగతిభవన్.. ఇప్పుడే ఖాళీ అవుతుందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని... బీసీలను రేవంత్ రెడ్డి ఏమనలేదన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తిడితే ఊరుకుంటామా అని వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త పథకాలు : ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములు లాక్కుంటున్నారన్న కోమటిరెడ్డి... తద్వారా వెబ్‌సైట్‌లో భూయాజమానుల పేర్లు నమోదు కాకపోవడంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన... దళిత బంధు, బీసీ బంధు తదితర పథకాలు ఓట్ల కోసమేనన్న వెంకట్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.
ఇకమీదట తరచుగా వారి ఇళ్లలో భేటీలు : ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ స్థానం కోల్పోయిందని... బీజేపీ గ్రాఫ్ పేకమేడలా కూలిపోయిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణను ఇదే తీరుగా ముందుకు తీసుకెళ్లి... ఎన్నికల్లో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ముందుకు సాగి... తామంతే ఒకటే అనే భావనను చాటాలని హస్తం నేతలు నిర్ణయించారు. ఇకమీదట తరచుగా సీనియర్ నేతల ఇళ్లలో భేటీలు జరపనున్నట్లు తెలిపారు. చేరికల విషయంలో పార్టీకి నష్టం లేకుండా వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఉండేట్లు క్షేత్రస్థాయిలో చర్చించిన తరువాతనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :
- Revanth Reddy Vs Jagadeesh Reddy : 'ఉచిత్ విద్యుత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పుడైనా సమీక్ష చేశారా..?'
- Teegala will Joins in Congress : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. 'కారు' దిగి 'చేయి' అందుకోనున్న తీగల కృష్ణారెడ్డి!
- Telangana Assembly Elections 2023 : అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ అడుగులు.. ప్రచార సైన్యాన్ని ప్రకటించిన ఏఐసీసీ