వివేకానందుడు వందేళ్ల కింద చెప్పినా... ఈ వర్చువల్ యుగానికీ సరిపోయే ఎవర్‌గ్రీన్ గీటురాళ్లివి! వీటిని తరాజులో కొల్చుకోండి... మీలోని యువకువెంతో తేల్చుకోండి!
ఆ దమ్మెంత?
కడుపులో చల్ల కదలకుండా... కంఫర్ట్‌జోన్‌లో కూర్చుంటారా... ముందున్న ఛాలెంజింగ్ అవకాశాల్ని రిస్క్ తీసుకొని అందుకుంటారా? రిస్క్ తీసుకోవటం... అంటే ఏదో గుడ్దెద్దు చేలో పడ్డట్లో... ఎవరో ఏదో చేస్తున్నారు... మనం కూడా చేసేద్దామని ఏదో ఓ నిర్ణయం తీసుకోవటం కాదు. కాలిక్యులేటెడ్ రిస్క్! బేరీజు వేసి ధైర్యం చేయటం! గెలిస్తే మనల్ని అనుసరిస్తారంతా... లేదనుకో... మన నుంచి నేర్చుకుంటారంతా! మరలాంటి కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునే దమ్ముందా? చేసే పనిపై స్పష్టతుందా?
నిద్రలోనూ... మరచిపోకుండా
నేనది సాధించాలి... నేనిది కావాలి... నేనది చేయాలి... నేనిలా ఎదగాలి... ఇలాంటి మాటలు చెప్పటం... అప్పుడప్పుడూ అనుకోవటం కాదు. అనుక్షణం ఆ లక్ష్య తపనలో తడిసిపోవాలి! ఆలోచనలో... ఆచరణలో... ఆహారంలో... నిద్రలో... అణువణువునా, కణకణానా... ప్రతి క్షణం తపించే గుణం... ఎంతుందేంటి?
ఆ దుర్భిణి ఉందా?
వాడట్లా... వీడిట్లా... అబ్బో వాళ్ళను భరించలేం... వీళ్ళు మహా పేచీకోరులు... ఎవరిలోనైనా అద్దంలోలా చెడు ఈజీగా కన్పిస్తుంది! అదేం గొప్పకాదు! కానీ పాలలోని వెన్నలా ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది. ఆ మంచిని గుర్తించే దుర్భిణి చూపుందా మీలో? వారిలా మారకుండానే ఆ మంచి నుంచి నేర్చుకునే మనసుందా?
బాసులానా... బానిసలానా?
వినయం ఉండాల్సిందే! పనిలోనైనా... ప్రవర్తనలోనైనా... కానీ పనెలా చేస్తున్నారు? పనంటే చదువు కావొచ్చు, ఇంట్లోది కావొచ్చు... ఆఫీస్‌ది కావొచ్చు...! అదెలా చేస్తున్నారు? ఎవరో చెప్పారనా... చెప్పారు కాబట్టి చేస్తున్నాననా? లేక ఇది నాది అనేలానా? ఎవరో చెప్పినా... చేసేది మీరే! మీ పనికి మీరే బాస్! మరెలా చేస్తున్నారు బాస్‌లానా? బానిసలానా?
నేర్చుకుంటున్నారా?
ఎవరో వచ్చి ఏదో చేయరు. ఎవరో వచ్చి ఏదో నేర్పరు! శారీరకంగానే కాకుండా అంతర్లీనంగా మీరెలా ఎదుగుతున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? బయట గురువులుండొచ్చు. కానీ మీకు మీరే గుగ్గురువువు! మరి ఆ గుగ్గురువు దగ్గర ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకుంటున్నారు?
నమ్మకం దేవుడిపై కాదు...
దేవుడున్నాడా లేడా... దేవుడిని నమ్మాలా వద్దా... జీవితంలో పదేపదే ఎదురయ్యే ప్రశ్న! ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు... మీపై మీకు నమ్మకం ఉందో లేదో తేల్చుకోండి! మిమ్మల్ని మీరు నమ్మలేనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మగలరు? మీలో మీకు నమ్మకం ఉండాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. అది బలంగా ఉండాలి. అదుంటే పాము విషం కూడా మిమ్మల్ని చేయలేదు. మరి ఆ నమ్మకం ఎంతుంది?
ఉందా ఆ చూపు?
గతాన్ని చూసి జాగ్రత్త పడటం.. కాసింత ముందుకు చూడటం... చాలామంది చేసేదే. కానీ... మనోఫలకంతో ఓ నాలుగు అంగలు ఎక్కువ వేసి ముందుచూపు చూడటం... కెరీర్‌ను, జీవితాన్ని రచించుకోవటం దార్శనికుల లక్షణం! మరి అలాంటి చూపు మీలో ఉందా? నలుగురితో పాటు నారాయణలా... గుంపులో గోవిందయ్యలా నడుస్తున్నారా? లేక కాసింత ఎగిరి ముందుచూపు చూస్తున్నారా?
ఆ పాపం చేయకుండగలరా?
ఈ లోకంలో అత్యంత పాపం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు బలహీనమనుకోవటం; నాకు చేతగాదనుకోవటం... నేను చేయలేననుకోవటం... మరి ఈ పాపం చేయకుండా ఉండగలరా? ఎవ్వరమూ బలహీనులం కాదు. నిన్ను నువ్వు గెలిస్తే... ఈ ప్రపంచమే నీది! డబ్బు, పేరు, ప్రఖ్యాతులు... ఇవేవీ కావు. నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వమే నిన్ను కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. మరి నీదెలాంటి వ్యక్తిత్వం?
ఆ మూడింటితో జీవించగలవా?
బతకటానికి చాలా సూత్రాలుంటాయ్! కానీ ఓ మూడు... మాత్రం ఎప్పుడూ మరచిపోకూడదు. సాయం చేసినవారిని మరచిపోకు! ప్రేమించినవారిని ద్వేషించకు! నమ్మినవారిని మోసం చేయకు! మరి పాటిస్తున్నారా?
రోజూ మీటింగ్/డేటింగ్ ఎంత సేపు?
తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఉరుకులే ఉరుకులు. ఏదో పని! ఏదో కాలక్షేపం! వాళ్ళను కలవాలని... వీళ్ళతో మాట్లాడాలని... ప్రేమనీ... డేటింగనీ.. ఏదీ లేదంటే వాట్సపో, ఫేస్‌బుక్కో... టీవీనో! కంటికి, చెవికి ఎప్పుడూ ఖాళీ లేదు. ఇంతకూ మీతో మీరెంత సేపు మాట్లాడుకుంటున్నారు? మీతో మీరెంత సేపు డేటింగ్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరెంతసేపు కలుస్తున్నారు? మనసు మాటలేం వింటున్నారు? అదే కదా ధ్యానమంటే! మనపై మనకుండే ధ్యాసంటే! మీతో మీరు గడపకుంటే ఈ లోకంలో ఓ అద్భుతమైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని మిస్ అవుతున్నట్లే!
ఇదీ చూడండి: యువత కోసం ఇస్రో శాస్త్రవేత్తల వెబినార్