ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన రఘుు ఎమ్‌సీఎ పూర్తి చేశాడు. ఓ బహుళజాతి సంస్థలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేశాడు. స్థిరాస్తి వ్యాపారంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. విజయవాడలో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. అక్కడ పలువురిని మోసం చేసిన రఘు... అనంతరం హైదరాబాద్‌కి మకాం మార్చాడు. శ్రీనివాస్ బాబు అనే మరో వ్యక్తితో కలిసి 'స్వధాత్రి ఇన్‌ఫ్రా' పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు.
కంపెనీ మేనేజర్‌గా మీనాక్షి అనే మహిళను నియమించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. ఏజెంట్లను నియమించి ప్రచారం చేయించారు. ప్రజలను ఆకర్షించేందుకు అధిక వడ్డీలు చెల్లిస్తూ... డిపాజిట్లు రాబట్టారు. కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు కాజేశారు.
తీగలాగితే... డొంక కదిలింది...
స్వధాత్రి ఇన్ఫ్రా, స్వధాత్రి ప్రాజెక్ట్స్, స్వధాత్రి రియల్టర్స్ పేరుతో మూడు స్కీములను ప్రారంభించారు. తమ కంపెనీలో లక్షకు మించి పెట్టుబడి పెడితే ఏడాదిపాటు నెలకు 9శాతం వడ్డీ ఇస్తామని ఆశ జూపారు. దీంతో 950 మంది కస్టమర్లు 87 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేయించడం... నెలనెలా 10 వేలు వెనక్కివ్వడం... లాంటి పలు పథకాలతో 69 కోట్లు కాజేశారు. మొదట్లో ఒప్పందం ప్రకారం చెల్లించినా.. ఆ తర్వాత సరిగ్గా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. మూడు స్కీముల్లో మొత్తం 1450 మంది నుంచి రూ. 156 కోట్లు వసూలు చేశారని పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం ఆరు నెలల్లోనే వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అధిక వడ్డీలు ఇవ్వడం బ్యాంకులకే సాధ్యం కానప్పుడు వేరే వ్యక్తులు ఇస్తున్నారంటే ప్రజలు ఆలోచించాలని, మోసాలు చేస్తే తప్ప అది సాధ్యం కాదని పోలీసులు మరోసారి హెచ్చరించారు. కష్టపడిన సొమ్మును అత్యాశతో కోల్పోవద్దని సూచించారు.
ఇవీ చూడండి: టికెటింగ్ కంపెనీల ఆదాయం ఫట్.. వేతనాల్లో భారీ కోతలు