Jupalli and Ponguleti Suspended From BRS Party: కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని.. భారత రాష్ట్ర సమితి బహిష్కరించింది. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత బీరంహర్షవర్దన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడంతో.. జూపల్లి అసంతృప్తికి లోనయ్యారు.
జూపల్లి, బీరం మధ్య వైరం పెరిగి తరచూ కేసీఆర్, కేటీఆర్‌కి ఫిర్యాదు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన ఎంపీటీసీ అభ్యర్థులకు వ్యతిరేకంగా జూపల్లి కృష్ణారావు.. పనిచేసిన సొంతవర్గం నుంచి రెబల్‌గా పోటీచేయించారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ నాయకత్వం జూపల్లిపై అసహనంతో ఉంది. కృష్ణారావుకి పార్టీ కార్యకలాపాలకు ఆహ్వానం పంపడం లేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్గపోరు సృష్టించారని.. బీఆర్‌ఎస్ నాయకత్వం అసంతృప్తితో ఉంది.
జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వైరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ హవా కొనసాగినా... ఖమ్మంలో మాత్రం ఒకేస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకు ఆయన తీరే కారణమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పార్టీ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని.. తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ నాయకత్వం ప్రాధాన్యమివ్వడంతో.. పొంగులేటి మరింత దూరమయ్యారు.
కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పరోక్షంగా విమర్శిస్తున్నారు. ఆదివారం కొత్తగూడెంలో.. పొంగులేటి నిర్వహించిన కార్యక్రమానికి .. జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం.. ఇద్దరిపై వేటు విధించింది. పొంగులేటి, జూపల్లిపై.. వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్ సమర్ధించుకుంది. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులు అనుభవించిన తర్వాత విమర్శలు చేయడం తగదన్న ఆయన.. రాజకీయ అవకాశం రాలేదని దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నేతలపై వేటు వేయడంతో రెండు జిల్లాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోన్న ఉత్కంఠ నెలకొంది.
"పార్టీ అధినేతను పొంగులేటి, జూపల్లి విమర్శించడం సరికాదు. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరు. ఇద్దరు నాయకుల ప్రవర్తనను పార్టీ సహనంగా పరిశీలించింది. చాలా కాలం పార్టీ సంయమనంతో వ్యవహరించింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు నేతలు ఎవరి ఉచ్చులో ఉన్నారో అందరికీ తెలుసు." - నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇవీ చదవండి: