తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకు త్వరలోనే భాజపాలో చేరుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టంచేశారు. మహేంద్రాహిల్స్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భాజపా నేత వివేక్‌లు.. సర్వే సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపాలోకి రావాలని సర్వే సత్యనారాయణను ఆహ్వానించారు. వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడి తెలంగాణ సాధించుకుంటే.. ప్రస్తుతం దొరల పాలన కొనసాగుతోందని సర్వే సత్యనారాయణ అన్నారు. అరాచక పాలనను అంతమొందించడం భాజపాకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని.. పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడడమే లక్ష్యంగా భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా భాజపాకు ఓటు వేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన సర్వే సత్యనారాయణ భాజపాలోకి రావడం సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ఆయన సేవలను వినియోగించుకుంటూ భాజపాను మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. త్వరలోనే భాజపా పెద్దల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు