గాంధీ ఆసుపత్రి:
అనేక రకాల వైద్య సేవలందించే గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ కేంద్రంగా మార్చేశారు. కేవలం కరోనా బాధితులకే చికిత్స చేస్తున్నారు. 1100 పడకలున్నాయి. గతంలో నిత్యం 1500 మంది రోగులు వచ్చేవారు. సాధారణ సమస్యలతో వచ్చేవారు ప్రస్తుతం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.
ఉస్మానియా:
1000 వరకు పడకలున్నాయి. పాత భవనం కూలే దశకు చేరుకుంది. 400 పడకలను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారు. పది ఆపరేషన్ థియేటర్లకు పాత భవనంలోని మూడు మూతపడ్డాయి. అత్యవసర చికిత్సలే చేస్తున్నారు. మిగతావి వాయిదా వేస్తున్నారు.
నిమ్స్:
వైద్య సేవలకు రోగులు డబ్బు చెల్లించాలి. గతంతో పోల్చితే ఇక్కడ సర్జరీలు బాగా తగ్గాయి. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో సాధారణ శస్త్ర చికిత్సలూ వాయిదా వేయక తప్పడం లేదు.
నిలోఫర్:
అత్యవసర శస్త్ర చికిత్సలే నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే ముగ్గురు సిబ్బంది కరోనాతో మృతి చెందారు. మిగతా వారు ఆందోళన చెందుతుండడం వల్ల ఆ ప్రభావం సాధారణ సర్జరీలపై పడింది. వైద్యులు, సిబ్బంది వారం రోజులు పనిచేయడం, ఆ తరవాత వారం పాటు క్వారంటైన్‌లో ఉంటున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి
రోగులకు చేసే చాలా సర్జరీలకు రక్త పరీక్షలు తప్పనిసరి. ఈ జాబితాలో ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్ష చేరింది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా, నెగెటివ్ వచ్చిన వారికే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. గతంలో కొవిడ్ లక్షణాలుంటేనే నిర్ధారణ పరీక్షలు చేసేవారు. బాధితుల్లో 85 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించకపోవడం వల్ల కరోనా పరీక్ష తర్వాతే ముందుకెళుతున్నారు. చావు బతుకుల్లో ఉన్న రోగులు వస్తే మాత్రం పీపీఈ కిట్లు ఇతర జాగ్రత్తలు తీసుకొని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి, ఆ తరవాత కొవిడ్ పరీక్ష చేస్తున్నారు.
అత్యవసర సర్జరీలన్నీ చేస్తున్నాం
ఉస్మానియాలో మూత పడిన 3 ఆపరేషన్ థియేటర్లు వేరే చోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర శస్త్ర చికిత్సలు వాయిదా వేయకుండా చేస్తున్నాం. ఆపినా.. ప్రమాదం లేవనుకున్నవి మాత్రమే వాయిదా వేస్తున్నాం. ఉస్మానియాలో కొవిడ్ రోగులకు 50 పడకలు కేటాయించాం. వైద్యులు, సిబ్బంది ఆ విధుల్లో తలమునకలై ఉండడం వల్ల సర్దుబాటు చేసుకుంటున్నాం.
- డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా
ఈ సర్జరీలు వాయిదా వేయొద్దు
- క్యాన్సర్ అనుమానిత కణుతులు
- గుండె నాళాల్లో అడ్డంకులు
- మెదడులో కణుతులు
- కడుపులో తరచూ నొప్పి
- కిడ్నీల్లో వేధిస్తున్న రాళ్ల సమస్య
- తీవ్ర కాలేయ సంబంధిత వ్యాధులు
- చిన్న, పెద్దపేగులో తీవ్ర ఇబ్బందులు