తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఎండలు గరిష్ఠంగా 43-46 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఎండవేడి మరింతగా విజృంభిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండువేసవిలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుప్పకూలే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, బీపీ, షుగర్, మానసిక రుగ్మతలు, తదితర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఎండల్లో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు, ట్రాఫిక్ పోలీసులు.. తదితరులు ఆరోగ్య సంరక్షణ విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వడదెబ్బ ముప్పు
వేసవి వేడికి ఒంట్లోంచి నీటితో పాటు ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా శరీరంలో నీటిని, లవణాలను భర్తీచేయాల్సిందే. శరీరం ఎండవేడికి గురైనపుడు అందులోని ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా దేహంలో వేడి అంతకంతకూ పెరిగిపోయి.. కుప్పకూలిపోతారు. ఇది అత్యవసరంగా వైద్య చికిత్సనందించాల్సిన పరిస్థితి.
చర్మ సంరక్షణ ప్రధానం
ఎండాకాలంలో చర్మంపై చెమట పేరుకుపోతుంది. దీంతో బ్యాక్టీరియా చర్మం లోపలికి చేరి సెగ్గడ్డలు ఏర్పడతాయి. చంకలు, గజ్జల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తి తామర వస్తుంది. అందుకే ఆ ప్రదేశాలను పొడిగా ఉంచుకోవాలి. మధుమేహులు కాలివేళ్ల మధ్య కూడా తడి లేకుండా చూసుకోవాలి. పౌడర్‌ను ఉపయోగించాలి. ఎండలో తిరిగితే ముఖంపై నల్లమచ్చలు, చర్మం ఎర్రబడడం, పొక్కులు, దురద వంటి సమస్యలు వస్తాయి. బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు వంటివి ఉపయోగించాలి.
-డాక్టర్ మాధవి, చర్మవ్యాధి నిపుణులు
వేసవిలో నీరు తగినంతగా తీసుకోకపోతే మధుమేహుల్లో రక్తం చిక్కబడుతుంది. అతిమూత్ర సమస్య వల్ల ఒంట్లోంచి నీరు వెళ్లిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి 250 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కోమాలోకి జారిపోయే ప్రమాదముంది. కనీసం 3-5 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయ సమస్యలతో బాధపడుతున్నవారు ఒకేసారి మూణ్నాలుగు లీటర్ల నీటిని తాగొద్దు. ఇన్సులిన్‌ను 25డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి ఉండే ప్రదేశాల్లో భద్రపర్చకూడదు. దుస్తుల మధ్యలో అస్సలు పెట్టొద్దు. ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే.. పొడిగా ఉండే చిన్నమట్టి కుండను ఇసుకపై ఉంచి, అందులో ఇన్సులిన్‌ను భద్రపర్చాలి. ఇసుకను తడుపుతూ ఉండాలి.
- డాక్టర్ పీవీ రావు, ప్రముఖ డయాబెటాలజిస్ట్
బీపీ మాత్రలు సరిచూసుకోవాలి
అధిక రక్తపోటుకు వాడే కొన్నిరకాల మాత్రలకు ఒంట్లోని నీటిని తగ్గించే గుణం ఉంటుంది. మానసిక చికిత్స, పార్కిన్‌సన్ వంటి నరాల సంబంధిత(న్యూరాలజీ) వ్యాధుల్లో ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల చెమట పట్టే గుణం తగ్గిపోతుంది. ఫలితంగా ఎండలో వెళ్లినప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. అందువల్ల వేసవిలో వైద్యుల సలహా మేరకు మందుల మోతాదులను సరిచేసుకోవాలి. మండుటెండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఇంట్లో ఉన్నా ఎప్పటికప్పుడూ నీరు తాగాల్సిందే. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినా.. తరచూ ఓఆర్‌ఎస్ ద్రావణాలు, మజ్జిగను తీసుకుంటూ ఉండాలి. వడదెబ్బకు గురైనవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జ్వరం తగ్గించే మాత్రలను ఇవ్వద్దు.
-డాక్టర్ ఎంవీ రావు, ప్రముఖ జనరల్ ఫిజీషియన్