తెలంగాణ వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. భానుడి సెగల తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 43 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
రాగల మూడు రోజుల పాటు
తెలంగాణ రాష్ట్రంలోకి వాయు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు రోజులుగా గాలిలో తేమశాతం తగ్గడం వల్ల పొడి వాతావరణం ఏర్పడిందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో వడ గాల్పుల తీవ్రత రాగల మూడు రోజుల పాటు ఉంటుందని ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జనగామ, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని ప్రకటించారు.
బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి బయట తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతోపాటు గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్టిగ వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు.
ఇదీ చూడండి : ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం