Success Story of Badi House Millet Hotel : అందరూ నడిచే దారిలో తానూ వెళ్తే ఏముంటుందని భావించింది ఈ యువతి. ఎంతో అధ్యయనం చేసి మిల్లెట్స్‌తో(Millets food) తయారయ్యే ఆహారాన్నిఅందించాలనుకుంది. బయటే ఎక్కువగా అల్పాహారం తినే ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా బడిహౌస్ ప్రారంభించింది. ఇంత చదువూ చదివి ఈ పనులేంటన్న మాటల్ని పట్టించుకోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది.
హైదరాబాద్‌లో స్థిరపడిన స్రవంతి ఎమ్మెస్సీ చదివింది. ఇంతకు ముందు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేది. కానీ ఒకరి వద్ద పనిచేయకుండా తానే స్వయంగా ఎదగాలనుకుంది. ఆహార పరిశ్రమలో ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టింది. అధిక నూనెలు, వేపుళ్లు, జంక్‌ఫుడ్(Junk food) వల్ల ఆరోగ్యం దెబ్బతినడం గ్రహించి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే బావుంటుందని అనుకుంది. కుటుంబ ప్రోత్సాహమూ తోడవడంతో నిర్భయంగా ముందుకెళ్లాలనుకుంది.
Badi House Millet Hotel in Hyderabad : యూట్యూబ్‌లో చూసిన ఒక వీడియో స్రవంతి జీవిత గమనాన్నే మార్చేసింది. లెక్చరర్ ఉద్యోగం నుంచి టిఫిన్ సెంటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో సతమవుతున్న వారికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆరు నెలలపాటు అధ్యయనం చేసి మరీ ఈ రంగంలోకి ప్రవేశించానంటోంది స్రవంతి. సంప్రదాయ ఆహారానికి గల ఆదరణ తెలుసుకుని ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనుకుంది.
ఉద్యోగ వేట నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వరకు- ఈ యువరైతు ప్రస్థానం సాగిందిలా
స్రవంతి తన భర్త ప్రోత్సాహంతో బోడుప్పల్‌లో బడి హౌస్ ప్రారంభించింది. స్వయంగా తానే వండి వడ్డిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొంటోంది. హాయిగా లెక్చరర్ ఉద్యోగం చేసుకోక ఈ వండి వార్చే పనేంటన్న సూటిపోటి మాటలను పట్టించుకోలేదు స్రవంతి. వాటినే ఛాలెంజ్‌గా తీసుకుని వ్యాపారాన్నివృద్ధి చేయడంపైనే దృష్టి సారించింది. బోడుప్పల్‌లో అల్పాహారశాలేంటి? అదీ మిల్లట్స్‌తో అని సందేహించిన వారందరి అంచనాలు తలకిందులు చేసింది.
రుచితో పాటు నాణ్యత, శుచీ శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ లాభాల బాటలో పయనిస్తోంది. కుటుంబమిచ్చిన ప్రోత్సాహంతోనే తనకొచ్చిన ఆలోచనను అమలులో పెట్టగలిగానంటోంది స్రవంతి. సిరిధాన్యాలతో ఆధునిక వంటకాలు సృష్టించి కళాశాల విద్యార్థుల ఆదరణనూ సొంతం చేసుకుంది. బడి హౌస్ ప్రారంభించిన అయిదు నెలలకే తనకంటూ ఓ ప్రత్యేకత దక్కించుకుంది. వీలైనంత త్వరలో ఇతర ప్రాంతాలకూ తమ మిల్లెట్ రుచులను పరిచయం చేస్తానని అంటోంది.
"నేను ఇంతకు ముందు ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశాను. ఒకరి వద్ద పనిచేయకుండా నాకు నేనుగా స్వయంగా ఎదగాలనుకున్నాను. ఆహార పరిశ్రమలో ఉపాధి అవకాశాలపై దృష్టిసారించాను. తృణ ధాన్యాలతో చేసిన వంటలకు మంచి గిరాకీ ఉందని గ్రహించి బడి హౌస్ పేరిట టిఫిన్‌సెంటర్‌ను ప్రారంభించాను. విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. వీలైనంత త్వరలో ఇతర ప్రాంతాలకూ తమ మిల్లెట్ రుచులను పరిచయం చేస్తాను". - స్రవంతి, బడిహౌస్ నిర్వాహకురాలు