- నేటి తరం.. శ్రమను నమ్ముతోంది
- కష్టాన్ని స్వీకరిస్తోంది
- ఆవిష్కరణలకు ఆయువుపోస్తోంది
- ఆపన్నులకు అభయమిస్తోంది
- తర్వాతి తరానికి స్ఫూర్తినిస్తోంది
- అన్నింటా మేమున్నామంటూ సరైన రేపటికి బాటలు వేస్తోంది
- హైదరాబాద్ నగరంలోని అలాంటి వారిలో కొందరి పరిచయంతో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు-ఈటీవీ భారత్’ అందిస్తున్న ప్రత్యేక కథనాలివి
స్మార్ట్ ఆలోచనకు రూ.కోట్ల వరద
‘‘బీటెక్ పూర్తయ్యాక.. మూడేళ్లు పనిచేశా. కానీ ఏదో వెలితి. ఉద్యోగం మానేసి ట్రిపుల్‌ఐటీలో చేరి మాస్టర్స్ రీసెర్చ్ చేశా. కొత్తగా ప్రయత్నించాలన్న పట్టుదలతో అంకురసంస్థ ఏర్పాటు చేశా.’ అని చెబుతున్నారు ట్రిపుల్‌ఐటీ హెదరాబాద్ పూర్వ విద్యార్థి మద్దికట్ల సునీల్. 2017లో బ్లూసెమి అంకుర సంస్థ స్థాపించి స్మార్ట్ పరికరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) పరికరాల్లో వినియోగించే చిప్‌లను తయారు చేస్తున్నారు. గతేడాది సెన్స్ పేరిట ప్రపంచంలోనే తొలిసారిగా వైర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ థర్మల్ స్కానింగ్ పరికరాన్ని రూపొందించారు. గతేడాది అక్టోబరులో లక్సెంబర్గ్‌కు చెందిన పెట్టుబడి గ్రూపు జెమ్ గ్లోబల్ ఈల్డ్ కంపెనీ రూ.514కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం విశేషం. బ్లూసెమీ కంపెనీ ట్రిపుల్‌ఐటీలోని సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఏర్పాటైంది.
రూ.3లక్షల యంత్రం రూ.30 వేలకు తేవాలని
ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఇద్దరు విద్యార్థులు.. ముగ్గురికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి.. అలా ముందడుగు వేశారు బెనెట్‌దాస్, పీఎస్‌కేఎన్ పావని, యశ్వంత్‌రెడ్డి. 30ఎం జీనోమిక్స్ పేరిట అంకురసంస్థ ఏర్పాటు చేసి హెచ్‌సీయూలోని ఆస్పైర్ బయోనెస్ట్ నడిపిస్తున్నారు. రియల్‌టైమ్ పీసీఆర్ తరహాలోనే సాధారణ పీసీఆర్ యంత్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు తమ ప్రయోగశాలల్లో పరీక్షలు చేసే సదుపాయం సులువు కానుంది. ప్రస్తుతం ఈ యంత్రాలు మార్కెట్‌లో రూ.3లక్షల వరకు అందుబాటులో ఉండగా.. కేవలం రూ.25-30వేలకు అభివృద్ధి చేయనున్నారు. జన్యు సంబంధిత వ్యాధులను గుర్తించే కిట్లు సిద్ధం చేస్తున్నారు. ఏదైనా నమూనా నుంచి డీఎన్‌ఏ వేరు చేసే యాంప్‌రెడీ పరికరాన్ని తయారు చేశారు. బెనెట్‌దాస్‌ది 2015లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పాండిచ్చేరిలో పనిచేశారు. తర్వాత గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చేరారు. అక్కడే పావని, యశ్వంత్‌రెడ్డి పరిచయమయ్యారు. ముగ్గురూ అంకురసంస్థను ప్రారంభించారు.
డ్రోన్ అంటే ఒకే పరిమాణంలో ఉంటుంది.. ఒకే తరహా వస్తువులను మోసుకెళ్తుంది.. అలా కాకుండా బరువుకు తగ్గట్టుగా మారి.. వస్తువులను తీసుకెళ్లే ఆలోచనతో ఎలాస్టికాప్టర్‌కు ఆలోచన చేశారు బోనగిరి సూరజ్. ఒకవైపు ట్రిపుల్‌ఐటీలో పరిశోధక విద్యార్థిగా ఉంటూనే.. మరోవైపు ఆర్కా ఏరోస్పేస్ పేరిట అంకురసంస్థను గతేడాది మార్చిలో ఏర్పాటు చేశారు. సరికొత్త రకం డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎలాస్టీకాప్టర్ పేరిట ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు. మరొక డ్రోన్‌ను నెలాఖరుకు ఆవిష్కరించనున్నారు. మొత్తంగా ఐదు రకాల డ్రోన్లను తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. అవి బరువుకు తగ్గట్టుగా మారి వస్తువులను మోసుకెళ్లగలవు. ‘‘ప్రభుత్వం నుంచి టైడ్ 2.0 గ్రాంటు, ట్రిపుల్‌ఐటీ నుంచి ప్రొడక్టు గ్రాంటు రావడంతో ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగా’ అని సూరజ్ వివరించారు.
వందల పత్రాలు.. సమాధానం 3 సెకన్లలోనే
అవసరానికో రకమైన డ్రోన్
గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగం చేస్తే అందరిలో ఒకడిగా మిగిలిపోతానని అనుకున్నాడు నగరానికి చెందిన విష్ణు రమేశ్. అందుకే 2019లో బిట్స్ నుంచి బీటెక్ పూర్తయ్యాక అంకుర సంస్థకు శ్రీకారం చుట్టాడు. అతని ఆలోచనలకు పాకాల శరత్, మనీష్ శ్రీవాత్సవ జత కలిశారు. ముగ్గురూ కలిసి సబ్‌టల్.ఏఐ అంకురాన్ని ప్రారంభించారు. వీరి సంస్థ మెషిన్‌లెర్నింగ్ ఆధారిత స్టార్టప్. కంపెనీలు, వ్యాపారంలో వందల పత్రాలు ఉంటాయి. ఏదైనా ప్రశ్న అడిగితే.. అన్ని పత్రాల్లో నుంచి జవాబును కేవలం 3 సెకన్లలోనే తెలియజేస్తుంది. ఈ వెబ్ అప్లికేషన్‌ను ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకు వినియోగిస్తోంది.
రిలీఫ్ రైడర్స్ సభ్యులు
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో బయటకు వెళ్లి అవసరమైన సరకులు, మందులు తెచ్చుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అప్పుడే మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు నగరానికి చెందిన రిలీఫ్‌రైడర్స్ సభ్యులు. సైకిల్‌పై ఇంటి వరకు వెళ్లి వారికి అవసరమైనవన్నీ అందించారు. ఇందులో 20 నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారే ఎక్కువ.
అలా ఏర్పడింది...
నగరంలోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న శాంతన సెల్వన్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైక్లింగ్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంస్థ ఏర్పాటు తర్వాత కొవిడ్ సమయంలో సేవలపై ఆలోచన వచ్చింది. వెంటనే సైక్లింగ్ బృందాలకు ఈ విషయం చెప్పగా చాలా మంది స్పందించారు. 170 మందికి పైగా ముందుకు వచ్చారు. దీంతో అవసరమైన వారికి ఔషధాలు అందించారు.
రెండోవేవ్‌లో రోజూ..
* 50 మంది ఇంటికి మందులు, సరకుల అందజేశారు.
* 100 మందికి ఉచిత ఆహారం పంపిణీ చేశారు.
* సేవలు కోరే వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: 95661 70334
సరకుల వితరణలో వాలంటీర్లు
చేయీ చేయీ కలిపిన 250 మంది యువతీ యువకులు కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు సేవలు అందించారు. క్వెస్ట్ బుక్ అంకురసంస్థ సహ వ్యవస్థాపకుడు కారంచేటి శ్రీహర్ష ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. కొవిడ్.క్వెస్ట్‌బుక్ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. కరోనా బాధిత రోగులకు సదుపాయాలు సమకూర్చేందుకు వెచ్చించారు. ట్రిపుల్‌ఐటీ పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో కలిసి కొవిడ్ వార్ రూం ప్రారంభించారు. యువ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భాగస్వాములయ్యారు. వార్ రూంకు మోహిత్‌జైన్, యర్రం సుధీర్ సాంకేతిక సహకారం అందించారు. రోగుల నుంచి ఫోన్ రాగానే.. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలు, ఔషధాలు.. ఇలా బాధితుల నుంచి అవసరాలు తెలుసుకుని అందించారు. 250 మంది బాధితుల నుంచి ఫోన్లు తీసుకోవడం.. సమాధానాలు చెప్పడం.. రోగుల అవసరాలు తెలుసుకుని పరికరాల కొనుగోలు.. వాటిని తిరిగి బాధితులకు అందించడం.. ఇలా ప్రతి అవసరాలన్ని బృందాలు విభజించుకుని పూర్తి చేశారు. గతేడాది ఏప్రిల్‌లో కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చిన దశలో దాదాపు 2వేల వినతులు స్వీకరించి.. ఔషధాలు, ఆక్సిజన్‌సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందించారు. క్రౌడ్ ఫండింగ్ రూపంలో రూ.40లక్షలు సేకరించి ఆర్థిక సాయం అందించారు. నగరంలోనే కాక దిల్లీ, బెంగళూరు, భోపాల్, అజ్‌మేర్ వంటి ప్రాంతాల్లోనూ సేవలు అందించారు.
సిరాక్షరాలు
సిరాగుర్తు వేలికి రాసుకుని.. నేతల భవితను రాస్తామంటోంది నగర యువత. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో యువ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 27 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల తీర్పులో యువత కీలకంగా మారారు. ఏ నాయకుడైనా.. ఏ పార్టీకైనా.. యువ ఓటర్లను ఆకట్టుకోవడం కీలకం కానుంది. మూడు జిల్లాల్లో 1,01,27,483 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 30-35 శాతం మంది యువత ఓటర్లుగా ఉన్నట్లు గణంకాలు సూచిస్తున్నాయి. కొత్త ఓటర్ల విషయానికి వస్తే ఏటా పెద్దసంఖ్యలో నమోదవుతున్నారు. ఇటీవల వెలువడిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం మూడు జిల్లాల పరిధిలో 32,555 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరంతా 18-19 మధ్య ఏళ్ల వయసు వారే.
జిల్లాల వారీగా 18-19 వయసు ఓటర్లు ఇలా...
హైదరాబాద్ 13,025
రంగారెడ్డి 9,874
మేడ్చల్ మల్కాజిగిరి 9,656
వ్యాక్సినేషన్‌లోనూ ముందే..
కరోనాపై జరుగుతున్న యుద్ధంలో యువత తమ వంతు కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని యువతీయువకులు పెద్ద సంఖ్యలో ముందుకువచ్చి టీకా వేయించుకుంటున్నారు. 15-18 మధ్య వయసు ఉన్న యువతకు వ్యాక్సినేషన్ ఈ నెల 3 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో 30శాతం మంది టీనేజర్లు తీసుకున్నారు. 18-44 వయసు వారిలో నిర్దేశిత లక్ష్యం దాదాపుగా పూర్తయింది.
అంకుర సంస్థలు ఇలా....
* రిజిస్టర్ చేసుకున్నవి 6,660
* సీడ్ ఫండ్ దశలో ఉన్నవి 356
* వెంచర్ ఫండ్: 148
* ఇంక్యుబేషన్ దశలో ఉన్నవి 3,420
* కొనుగోలు స్థాయిలో.. 150
2021లో నిధుల ప్రవాహం ఇలా..
* గ్రాంటు దక్కించుకున్నవి: 47
* మొత్తం: రూ.210.02కోట్లు
* 2020తో పోల్చితే పెరుగుదల 0.55శాతం
ఇదీ చదవండి : TRS On National Politics: జాతీయ రాజకీయాలపై తెరాస మళ్లీ ఫోకస్