తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం... తొలిసారిగా ఇవాళ భేటీ కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సభ్యులుగా ఉన్నారు. ఉదయం11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను ఇప్పటికే నిర్ణయించిన కేంద్ర హోంశాఖ.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు పంపింది.
విభజన అనంతరం వచ్చిన సమస్యలకు సంబంధించి 5 అంశాలను అజెండాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ- ఎస్ఎఫ్సీ విభజన, ఏపీ జెన్కోకు.. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, పన్నుల్లో వ్యత్యాసాల సవరణ, బ్యాంకుల్లోని నగదు, డిపాజిట్ల పంపిణీ, పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన ఆర్థికాంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఆయా సమస్యల పరిష్కార మార్గాలపై సమాలోచనలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంట్లో స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై సయోధ్య కుదరడం లేదన్నారు. రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం మేరకే ఆస్తుల పంపకం జరుగుతుందని తెలిపారు. ఆ అంశంపై... ఇప్పటికే కేంద్ర హోంశాఖ 26 సమావేశాలు నిర్వహించినట్లు నిత్యానందరాయ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం