ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో విషాదానికి కారణమైన స్టెరైన్ రసాయన గ్యాస్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మండే స్వభావం ఉన్న ఈ గ్యాస్.. చాలా త్వరగా గాలిలో కలసిపోయి అంతటా కమ్మేస్తుంది. ఒకవేళ ఆ వాయువును మింగినా, అది కలిసిన గాలిని పీల్చినా తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.
చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్లు, కళ్లు ఎర్రబారి నీరు కారటం సాధారణంగా కనిపించే లక్షణాలు. శ్వాస ద్వారా అది శరీరంలోకి ప్రవేశిస్తే మాత్రం ఊపిరి తీసుకోవటానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ సమయంలో వాయువు ప్రభావానికి లోనైతే మాత్రం శరీరంలోని మిగిలిన అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంలోనూ పర్యవసనాలు వెంటాడతాయి.
తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్టెరైన్ వాయువు బారిన పడిన వారిని సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ముందుగా గ్యాస్ బారినపడిన వ్యక్తి వస్త్రాలు పూర్తిగా తొలగించి... పరిశుభ్రమైన బట్టతో శరీరాన్ని కప్పి ఉంచి ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలి. అపస్మారక స్థితికి చేరినా... శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సహాయ చర్యల్లో పాల్గొనే వారు అన్ని విధాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరి తీసుకోవటం కోసం శ్వాస సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా కలుషిత రసాయనాలు శుద్ధి చేసే వ్యర్థ జలాలు, మురుగునీటి కాల్వలకు చాలా దూరంగా ఉండాలి.
ఇదీ చూడండి: హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్