tspsc group 1 study material: రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందని ఆనందిస్తున్న అభ్యర్థులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సిలబస్ మేరకు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో వారు హైరానా పడుతున్నారు. దీనికోసం వరుస కడుతున్న ఉద్యోగార్థులతో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. ఇక్కడ పుస్తకాలు లభించకపోవడంతో అభ్యర్థులు జిరాక్సు కేంద్రాల్లో దొరుకుతాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు.
మరికొందరు తమ మిత్రులు రాసుకున్న నోట్సును జిరాక్స్ తీయించుకుంటున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్/ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. అభ్యర్థులకు ప్రతి రోజు విలువైనదే కావడంతో స్టడీమెటీరియల్ వెతుకులాటలో వారు ఉత్కంఠకు గురవుతున్నారు. గ్రూప్ -1 తదితర పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా పరిగణిస్తారు. కానీ ఉద్యోగాల భర్తీపై గత ఆరు నెలలుగా ప్రభుత్వం వైపు నుంచి సూచనలు అందుతున్నా, అకాడమీ ఆమేరకు సన్నద్ధం కాలేదు. డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నా, పుస్తకాలు ముద్రించలేదు.
అందుబాటులో అరకొరగా.. అకాడమీలో ప్రస్తుతం సగానికిపైగా సబ్జెక్టులకు పుస్తకాల కొరత ఉంది. భారత రాజకీయాలు, భారత ప్రాచీన చరిత్ర - సంస్కృతి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం - చరిత్ర, భారత రాజ్యాంగం - పరిపాలన, తెలంగాణ ఆర్థిక పరిస్థితి వంటి పలు పుస్తకాలు లభించడంలేదు. పర్యావరణ సమస్యలు - అభివృద్ధి పుస్తకం ఆంగ్ల మాధ్యమంలో ఉన్నప్పటికీ తెలుగులో కొరత ఉంది. అకాడమీ కార్యాలయం వద్దకు శుక్రవారం పుస్తకాల కోసం వచ్చిన కొందరు ఉద్యోగార్థులు తమ ఆవేదన వెలిబుచ్చారు.
‘గ్రూప్-1 స్టడీ మెటీరియల్ కొనుగోలు కోసం వచ్చాను. ఇప్పటికీ సగానికి పైగా పుస్తకాలు లేవు. తెలుగు మాధ్యమంలో పుస్తకాల కొరత ఎక్కువగా ఉంది’ అని ఉద్యోగార్థి నవీన్ తెలిపారు. ‘నాతో పాటు మరో స్నేహితుడు గ్రూప్-1కు సిద్ధమవుతున్నారు. కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి’ అని సాయిచరణ్ అనే మరో అభ్యర్థి చెప్పారు.
మరో 15, 20 రోజుల్లో పుస్తకాలు అందుబాటులోకి రావచ్చని తెలుగు అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. కాగితం సరఫరా టెండర్ అసోంకు చెందిన సంస్థకు దక్కిందని సమాచారం. అక్కడి నుంచి కాగితం రాగానే ముద్రణ మొదలుపెట్టి, పది రోజుల్లో పుస్తకాలు సిద్ధం చేస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: