పల్లె విద్యార్థుల్ని సెల్ సిగ్నల్ సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకు నిత్యం ఎంతో ఇబ్బందిపడుతున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఇప్పుడు ఆన్‌లైన్ ఒక్కటే మార్గంగా మారింది. కొవిడ్‌తో గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే చాలాచోట్ల సెల్‌ఫోన్‌లకు అసలు సిగ్నళ్లే అందడంలేదు. దీంతో పల్లె విద్యార్థులు సిగ్నల్స్ కోసం ఒక్కోచోట చెట్లు, బండలు, ఇళ్లు ఎక్కుతున్నారు. ఊరి బయటి ప్రాంతాల్లో వెతుకుతున్నారు. చాలాచోట్ల సమీపంలో 3జీ, 4జీ నెట్‌వర్క్ లేకపోవడంతో ఇంటర్నెట్ అసలు స్పీడ్ ఉండడం లేదు. 2జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నా స్పీడ్ చాలా తక్కువగా ఉంటోంది. ఏదన్నా సైట్ ఓపెన్ కావాలంటే చాలా సమయం పడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడంపై యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సగానికిపైగా మండలాల్లో ఈ ఇబ్బంది ఉంది.
లింక్ ఓ పట్టాన ఓపెన్ అయితేనా..
విద్యా శాఖ ఒక లింక్‌ద్వారా పరీక్ష పత్రాన్ని అందుబాటులో ఉంచుతోంది. వారంలో విద్యార్థులు చదివిన పాఠాల ఆధారంగా ఆ పత్రంలో మల్టిపుల్ ఛాయిస్‌లో పరీక్ష రాయాలి. వెంటనే మూల్యాంకనం పూర్తయి విద్యార్థి సామర్థ్యం వెల్లడవుతుంది. సరైన నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో పరీక్ష పత్రం ఓ పట్టాన తెరుచుకోవడంలేదు. ఓపెన్ అయినా ఇంటర్నెట్ సరైన స్పీడ్ లేక దానిలోని ప్రశ్నలు భర్తీ చేయడం కష్టంగా ఉంటోంది. దీంతో గంటల పాటు విద్యార్థులు చెట్ల కింద, చెట్ల మీద, పొలాల్లో వేచి ఉంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. హోంవర్క్ పూర్తి చేసి ఆ ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో బాగా ఇబ్బంది
"నేను మూడు మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈవోను. సిగ్నల్స్ లేని ప్రాంతాలకు ఉపాధ్యాయులను పిల్లల వద్దకు నేరుగా పంపుతున్నాం. నేనూ పల్లెలకు వెళ్లి పరిశీలిస్తున్నా. అశ్వారావుపేట మండలంలో ఐదువేల మంది విద్యార్థులుంటే దాదాపు 500 మందికి సిగ్నల్స్ లేవు. గుండాల మండలంలో 2,380 మందిలో 1,700 మందికి, ఆళ్లపల్లి మండలంలో సగం మందికి సిగ్నల్ లేవు. మేం ఇప్పటికే ఈ లెక్కలు తీశాం."
-పెండకట్ల క్రిష్ణయ్య, అశ్వారావుపేట, ఆళ్లపల్లి, గుండాల మండలాల విద్యాశాఖ అధికారి, భద్రాద్రి జిల్లా
కరెంటు పోతే సిగ్నల్ కట్
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడుతోపాటు చుట్టుపక్కల 16 గ్రామాలకు ఉన్నది ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్ మాత్రమే. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే బ్యాటరీలు పనిచేయాలి. ఒక్కోసారి అవీ మొరాయించి సెల్ సిగ్నల్స్ రావడం లేదు. రోజుల తరబడి సమస్యలే. 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి సరిచేస్తే తప్ప బాగుపడటం లేదు.
నోట్స్ రాసి పంపుతున్నాం
"విద్యార్థులకు పాఠాలు చేరవేసేందుకు తరగతుల వారీగా వాట్సప్ గ్రూపులు తయారు చేశాం. సబ్జెక్ట్ ఉపాధ్యాయులు వర్క్‌షీట్స్ రూపొందించారు. వాటిని విద్యార్థులతో రాయిస్తున్నాం. కొంత మందికి యూట్యూబ్ లింక్ పంపుతున్నాం. మరికొంత మందికి పాఠాలు రికార్డు చేసి అందజేస్తున్నాం. మా మండలంలో సిగ్నల్స్ లేక కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు." - వెంకట్‌రాజు, ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాల, నాగర్‌కర్నూల్ జిల్లా
ఇక్కడ కనిపిస్తున్న వారిలో చాలామంది పదోతరగతి విద్యార్థులు. వీరిది నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మద్దిమడుగు. వేర్వేరు ప్రాంతాల్లో చదువుతున్నప్పటికీ విద్యాసంస్థలు మూతపడటంతో ఊరికి చేరుకున్నారు. ఆన్‌లైన్ తరగతులు వినాలన్నా, డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా సెల్‌సిగ్నల్స్ కోసం ఊరి బయట ఉన్న చెలకకు చేరుకోవాలి. తోడుగా పెద్దలూ వస్తుంటారు. మారడుగు, ఇప్పలపల్లి, పడిచింతలబైలు, సార్లపల్లితోపాటు చెంచుపెంటల్లో ఇలాంటి సమస్యే ఉంది.
సిగ్నల్ సమస్యలున్న జిల్లాలు
- ఆదిలాబాద్
- నిర్మల్
- ఆసిఫాబాద్
- మంచిర్యాల
- నల్గొండ
- వనపర్తి
- నారాయణపేట
- నాగర్‌కర్నూల్
- వరంగల్ గ్రామీణ
- మహబూబాబాద్
- ములుగు
- జయశంకర్ భూపాలపల్లి
- భద్రాద్రి కొత్తగూడెం
ఇవీ చూడండి: