ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ పెచ్చరిల్లుతోంది. సర్ అనలేదని, నమస్తే పెట్టలేదని, చెప్పిన మాట వినలేదని జూనియర్ విద్యార్థులపై సీనియర్లు భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. రాష్ట్రంలో గత నెల రోజుల్లో మూడు ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూడటం పరిస్థితికి అద్దంపడుతోంది. బయటకు రాని, ఫిర్యాదులు చేయని ఘటనలు పదుల్లోనే ఉంటాయని అంచనా. అధిక శాతం విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, రాత్రి వేళల్లో నిఘా పెట్టాల్సిన స్క్వాడ్లు నిస్తేజంగా మారాయి. కొత్తగా తరగతులు మొదలై రెండు నెలలు గడుస్తున్నా విద్యాసంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం లేదు.
ఇటీవలే కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనలు: శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్‌లో ఓ విద్యార్థిపై పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేసి తీవ్రంగా కొట్టారు. దీనిపై విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన వర్సిటీ 12 మందిని ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. బాసర ఆర్‌జీయూకేటీలో ఈ నెల 17న ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. సార్ అని పిలవడం లేదని ముగ్గురు జూనియర్లపై సీనియర్లు దాడి చేసి కొట్టారు.
దీంతో అయిదుగురు విద్యార్థులపై వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో నెల రోజుల క్రితం సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై 20 మంది జూనియర్ విద్యార్థులు వేర్వేరుగా లేఖలు రాసి హాస్టల్‌లోని ఫిర్యాదుల బాక్స్‌లో వేయడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అక్టోబరు 26న ఉపకులపతి ఓ కమిటీని నియమించారు. ర్యాగింగ్ నిజమేనని నిర్ధారణ కావడంతో 25 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
యూజీసీ ఏం చెబుతోంది?: కేంద్రం 1970లోనే ర్యాగింగ్‌ను నిషేధించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో చట్టాన్ని తెచ్చారు. అయినా ర్యాగింగ్ ఆగలేదు. 2009లో దేశవ్యాప్తంగా 160కి పైగా ర్యాగింగ్ కేసులు నమోదు కాగా.. 10 మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో.. ర్యాగింగ్ నిరోధానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికంగానే కాదు.. మానసికంగా వేధించినా ర్యాగింగ్ కిందికే వస్తుందని సవరణనూ తెచ్చింది. విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు ఏటా ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తోంది. గత నెలలోనూ వర్సిటీలను హెచ్చరిస్తూ ఆదేశాలిచ్చింది.
ఈ చర్యలు తీసుకోవాలి: ర్యాగింగ్ ఘటన బయటపడగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. నిందితులను హాస్టల్/విద్యాసంస్థ నుంచి బహిష్కరించవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు.
లోపాలివీ: అన్ని విద్యాసంస్థలు యాంటీ ర్యాగింగ్ సెల్/స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నా.. అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కమిటీలను ఏర్పాటు చేసినా.. వాటికి జవాబుదారీతనం లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. ఆ కమిటీల మొబైల్ నంబర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు సమావేశాలు, కార్యశాలలు, వ్యాసరచన పోటీలు జరపాలి. చాలా వర్సిటీలు, కళాశాలల్లో ఈ చర్యలు మచ్చుకు కూడా కనిపించడం లేదు.
ఒకటి రెండు వర్సిటీలు ఆయా చట్టాలు, ఆదేశాలు, చర్యలను వెబ్‌సైట్‌లో పెట్టి చేతులు దులుపుకొంటున్నాయి. అధిక శాతం వర్సిటీలు, కళాశాలలు ఆ పని కూడా చేయడంలేదు. జేఎన్‌టీయూహెచ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా గోవర్ధన్ ఉన్న సమయంలో 2016లో ఏర్పాటు చేసిన కమిటీలు, అందులోని సభ్యుల పేర్లే ఇప్పటికీ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ఆయన తర్వాత ముగ్గురు ప్రిన్సిపాళ్లు మారారు. ఓయూ, బాసర ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్లలో కనీసం యాంటీ ర్యాగింగ్ కమిటీల ప్రస్తావనే లేదు. ఆర్‌జీయూకేటీలో ర్యాగింగ్ ఘటన తర్వాత కూడా స్పందన లేదు.
యూజీసీకీ ఫిర్యాదు చేయొచ్చు: ర్యాగింగ్‌పై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్, ఈమెయిల్, యాంటీ ర్యాగింగ్ పోర్టల్‌ను యూజీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
టోల్ ఫ్రీ నంబరు: 18001805522
ఈ మెయిల్: helpline@antiragging.in
వెబ్‌సైట్: www.antiragging.in
"అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం నిర్వహించి ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిస్తాం. వర్సిటీలు, కళాశాలల వెబ్‌సైట్లలో, నోటీసు బోర్డుల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు పెట్టిస్తాం. హాస్టళ్ల వద్ద రాత్రి వేళల్లో నిఘా ఉండేలా చూస్తాం. తరగతులు మొదలైన రెండు నెలల వరకు అప్రమత్తంగా ఉంటే ఆ తర్వాత ఇటువంటి ఘటనలు జరగవు. సైకాలజిస్టులతో అవగాహన సదస్సులూ ఏర్పాటు చేస్తాం." - ఆచార్య ఆర్.లింబాద్రి, ఛైర్మన్, ఉన్నత విద్యామండలి
ఇవీ చదవండి: