ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజారవాణా శాఖ ఉద్యోగులు సమ్మెలు, ప్రదర్శనలలో పాల్గొనకూడదని ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మీడియా ముందు ప్రభుత్వ నిర్ణయాలను, అధికారులను విమర్శించకూడదని అందులో స్పష్టం చేసింది. ట్రేడ్ యూనియన్ చట్టం-1926 పారిశ్రామిక వివాదాల చట్టం -1947 ఉద్యోగులకు వర్తించబోవని ఇటీవల విడుదల చేసిన నోటిఫకేషన్లో ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు పేర్కొన్నారు.
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కార్మికులు లేదా మజ్దూర్ల స్థానం నుంచి సిబ్బంది..ప్రభుత్వ సేవకులుగా మారారు. వీరందరికి ఏపీ సబార్డినేట్ సర్వీస్ నియమాలు -1996 వర్తిస్తాయి. దీని ప్రకారం ప్రభుత్వ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనల్లో పాల్గొనకూడదు. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నియమాలు వీరికి వర్తిస్తాయి. ఏవైనా విజ్ఞప్తులు, ఫిర్యాదులు, సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సంఘాల ద్వారా నివేదించి పరిష్కరించుకోవాలని అందులో సూచించారు.