ఉక్కు ధరలకు రెక్కలొచ్చాయి. సిమెంటు ధరలు మంట పుట్టిస్తున్నాయి. రూపాయి రూపాయి దాచుకుని సొంత ఇల్లు సమకూర్చుకోవాలనుకున్న వారి కల వాయిదా పడుతోంది. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని ఈ పరిణామాలు కుంగదీస్తున్నాయి. ఉక్కు, సిమెంటు, ఇసుక, వైరింగ్ సామగ్రి ధరలు పెరగడంతో వ్యయం చదరపు అడుగుకు రూ.200- రూ.250 వరకు పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా కంటే వాస్తవ నిర్మాణ వ్యయం 40 శాతం వరకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సిమెంటు, ఉక్కు ధరలదే అధిక భారం. రాష్ట్రంలో రాతి ఇసుక లభ్యత వల్ల ఇసుక ధరలు కాస్త అదుపులోనే ఉన్నా, మిగిలిన సామగ్రి, ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
రెండు నెలల్లో రూ.20 వేలు పెరిగిన ఉక్కు
గత ఏడాది జులై నుంచి ఇప్పటికి ఉక్కు ధరలు 55 శాతం పెరిగాయి. ఉదాహరణకు విశాఖ ఉక్కు 8 ఎం.ఎం. రాడ్‌ల ధర టన్ను రూ.70 వేలకు చేరింది. అది గత నవంబరు 15న రూ.49,800 ఉంది. స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్ (సింహాద్రి టీఎంటీ) ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం. చువ్వల ధర నవంబరులో రూ.45,800 ఉంటే, ఇప్పుడు రూ.64,500కు చేరింది.గత 15 ఏళ్లలో ఉక్కు ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి.
నిర్మాణాన్ని పర్యవేక్షించే మేస్త్రికి గతంలో రోజుకు రూ. 800 ఇచ్చేవారు. అది రూ. వెయ్యి నుంచి రూ. 1,200లకు పెరిగింది. కూలీలకు కనీసం రోజుకు రూ.800 ఇస్తున్నామని ఓ ఇంటి యజమాని చెప్పారు. రాష్ట్రంలో ఏటా సగటున 65-70 వేల వరకు అపార్టుమెంటు ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వాటిలో 55 వేల ఇళ్లు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే నిర్మితమవుతున్నాయని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామిరెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’తో చెప్పారు.
పెరిగిన సిమెంటు ధర
ప్రముఖ బ్రాండ్ల సిమెంటు ధర మూడు నెలల కిందట బస్తా (50 కిలోలు) రూ.300 ఉంటే ఇప్పుడు రూ.400కి చేరింది. మీడియం బ్రాండ్లయితే రూ.230 నుంచి రూ.300కి చేరాయి. ఉత్పత్తిదారులు కలసి ధరలు పెంచేయడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమని నిర్మాణరంగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సిమెంటు ధరలను నియంత్రించాలంటూ క్రెడాయ్, బిల్డర్స్ అసోసియేషన్ తదితర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే, కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినా ఫలితం శూన్యం.
అంతర్జాతీయ మార్కెట్లే కారణమా?
- అంతర్జాతీయ మార్కెట్‌లో గతంలో 397 డాలర్లు ఉన్న టన్ను ఉక్కు ధర ప్రస్తుతం 750 డాలర్లకు పెరిగింది. మూడు నెలల క్రితం 300 డాలర్లు ఉన్న టన్ను ఐరన్ స్క్రాప్ ధర ప్రస్తుతం 480 డాలర్లకు చేరింది. ఫిగ్ ఐరన్ ధర 330 డాలర్ల నుంచి 480 డాలర్లకు పెరిగింది.
- భారత్ నుంచి ఇనుప ఖనిజం, ఉక్కు ఉత్పత్తుల దిగుమతులను చైనా భారీగా పెంచేసింది.
- డిమాండ్ పెరగడంతో గనుల యజమానులూ ఇనుప ఖనిజం ధరలను పెంచేశారు. ఎన్‌ఎండీసీ సరఫరా చేసే ఇనుప ఖనిజం ప్రారంభ ధర సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో టన్ను రూ.3 వేలు ఉండగా ఇప్పుడది రూ.6,600కి చేరిందని, పన్నులు, ఇతర ఖర్చులతో కలిపి రూ. 9 వేలు అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
- ఉక్కు ధరలపై ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫిమి) మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఇనుప ఖనిజం ఎగుమతులను ఆరు నెలలు నిషేధించాలని ప్రధాని కార్యాలయానికి ఐఏఎస్‌ఏ ఇటీవల ఒక లేఖ రాసింది. దాన్ని ఫిమి ఖండించింది. ఉక్కు ధరల పెంపును సమర్థించుకోవడానికి ఐఎస్‌ఏ విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని, అంతర్జాతీయ ధరలతో సమానంగా ఇక్కడ ఉక్కు ధరలు పెంచేశారని, ఇనుప ఖనిజం ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే మన దగ్గర తక్కువగా ఉన్నాయని ఫిమి పేర్కొంది.
- సిమెంటు, ఉక్కు పరిశ్రమదారులు కుమ్మక్కై ధరలు పెంచుతున్నారని, దీనివల్ల నిర్మాణరంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. సిమెంటు ధరల విషయంలో ఉత్పత్తిదారులు, బిల్డర్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
నిర్మాణ రంగం కుదేలు
- చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టినవారు.. పెరిగిన వ్యయాన్ని భరించలేక వాటిని ఆపేస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్నవారు తప్పనిసరై కొనసాగిస్తున్నారు.
- ఒక చ.అడుగు నిర్మాణానికి 2.75 కిలోల నుంచి 3 కిలోల వరకు ఉక్కు అవసరం. 50 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సుమారు 10 వేల బస్తాల సిమెంటు అవసరమవుతుందని అంచనా.
- నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ప్రాజెక్టుల్లో పెట్టుబడులు నిలిచిపోతాయని, ఇల్లు కొనాలనుకున్నవారు ఇంకా ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారని నిర్మాణరంగ వర్గాలు చెబుతున్నాయి.
అనూహ్య భారం
సిమెంటు, ఉక్కు ధరల పెరుగుదలతో నిర్మాణ రంగంపై అనూహ్య భారం పడుతోంది. పలు దఫాలు ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వ ప్రాజెక్టులకు కంపెనీలు తక్కువ ధరలకు సిమెంటు ఇస్తుండటంతో ఆయా కంపెనీల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేకపోతోందనిపిస్తోంది.
- జి.రామిరెడ్డి, క్రెడాయ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ఇది ఎవరికీ మంచిది కాదు
ఇప్పుడున్నవి అసాధారణ ధరలు. అవింకా పెరుగుతాయే తప్ప, ఇప్పట్లో తగ్గేలా లేవు. ఉక్కు ధరలు ఇంతగా పెరగడం మంచిది కాదు. కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఇనుప ఖనిజం, ఉక్కు ఎగుమతుల్ని నియంత్రించాలి. దేశీయ పరిశ్రమల అవసరాలకు సరిపడా ఇనుప ఖనిజం లభించేలా చూడాలి. ఎన్‌ఎండీసీ ధరలనూ సాధారణ సాయికి తీసుకురావాలి.
- వి.వి.కృష్ణారావు, డైరెక్టర్, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ (సింహాద్రి స్టీల్స్)
- ఇదీ చూడండి: కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్