ఆన్‌లైన్ సేవలకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తున్న నేపథ్యంలో పురపాలకశాఖ గత నెల 16వ తేదీ నుంచి పలు ఆన్‌లైన్ సేవలను నిలిపివేసింది. ఈ కారణంగా రాష్ట్ర పురపాలక డైరెక్టర్ పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రెవెన్యూకు సంబంధించిన సేవలు నిల్చిపోయాయి. మ్యుటేషన్లు, ఆస్తుల విభజన, ఖాళీ స్థలాల పన్ను, కొత్త ఇంటినెంబర్ల కేటాయింపు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, ఆస్తుల స్వీయ మదింపు సహా వివిధ రెవెన్యూ సేవలు అందడంలేదు. ఆస్తి పన్ను చెల్లింపులకూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ సమస్య కొలిక్కిరాలేదు.
సాంకేతిక సమస్యలతో..
పాత సాఫ్ట్‌వేర్ అందుబాటులో లేకపోగా, కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటు కూడా పూర్తికాలేదు. రెండు రోజుల క్రితం ఆస్తిపన్నుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చినా సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో వసూళ్లు ఆగిపోయాయి. నెలరోజులుగా సమస్య కొనసాగుతుండటంతో కార్పొరేషన్ల పరిధిలో కీలకమైన మ్యుటేషన్లు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉండిపోయాయి. మున్సిపాలిటీల్లోనూ భారీ సంఖ్యలో పోగుపడ్డాయి. ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, లైసెన్స్‌ల పునరుద్ధరణ(రెన్యువల్) ప్రక్రియ నిలిచిపోయింది. ఆస్తిపన్ను స్వీయ మదింపు జరగడంలేదు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించడం లేదు.
‘‘సేవల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడెళ్లినా ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇంటి నంబర్లు లేకపోవడంతో కుళాయి కనెక్షన్లు తీసుకోలేకపోతున్నాం. ఆస్తిపన్ను చెల్లించేందుకు వచ్చి వెనుదిరుగుతున్నామని’' పలువురు వాపోతున్నారు.
మా చేతుల్లో ఏమీ లేదు..
రాష్ట్ర స్థాయిలోనే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, తామేమీ చేయలేమని మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని అధికారులు తేల్చి చెబుతున్నారు. తాము కూడా సేవల కోసం వచ్చే వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందిపడుతున్నామని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. మూడు నాలుగు రోజులైతే పర్వాలేదుగానీ, సుమారు ఐదువారాలుగా ఇదే పరిస్థితి ఉండటంతో దస్త్రాలు పేరుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇది రాబడులపైనా ప్రభావం చూపుతోందన్నారు.
ఇదీ చూడండి: 'సూక్ష్మరుణ సంస్థలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు'