ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల పల్లెపోరులో చివరి విడత ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 13 జిల్లాల పరిధిలోని 161 మండలాల్లో 3299 పంచాయతీలు, 33435 వార్డుల్లో నాల్గోవిడత ఎన్నికలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 553 పంచాయతీలు, 10921 వార్డులు ఏకగ్రీవమవగా.. మిగిలిన 2744 పంచాయతీలు, 22422 వార్డులకు రేపు ఉదయం పోలింగ్ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం అమలాపురం, ఏలూరు, నూజివీడు, గుంటూరు, మార్కాపురం, నెల్లూరు,తిరుపతి రెవన్యూ డివిజన్లతోపాటు మరికొన్ని మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు జరగుతున్నాయి. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో ఆయా గ్రామాలకు ఈ రాత్రికే చేరుకోనున్నారు.
భద్రతా చర్యలు చేపట్టిన ఎస్ఈసీ..
నాలుగోవిడత ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించిన ఎస్ఈసీ తదననుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధానంగా కడప జిల్లాలో ఎక్కువ శాతం ఏకగ్రీవాలైనా... పోటీ అనివార్యమైన చోట ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. జగన్ సొంత నియజకవర్గం పులివెందులలో 109 పంచాయతీలకు గాను 88 ఏకగ్రీవంకాగా మిగిలిన 21 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సింహాద్రిపురం మండలం కసనూరు, సింహాద్రిపురం, గురజాల, చవ్వారిపల్లి, రావులకొలను పైడిపాలెం, నంద్యాలంపల్లి, లోమడ, లింగాల మండలం కోమన్నూతల, లోపట్నూతల, బోనాల, అంకెవారిపల్లి, పెద్దకుడాల, వెలిదండ్ల పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది.
ఆ స్థానాల్లో ఆధిపత్య పోరు..
ఇక కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ కొన్ని చోట్ల నేతల ఆధిపత్య పోరాటంతో పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీమంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు సర్పంచ్ పదవులకు పోటీపడుతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు..
జమ్మలమడుగు నియోజకవర్గంలో 115 పంచాయతీలుంటే 18 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. పెద్దముడియం మండలంలో 18 పంచాయతీల్లో పోటీ నెలకొంది. ముద్దనూరు మండలంలో... 19 పంచాయతీలుండగా.... ఒక్కటీ ఏకగ్రీవం కాలేదు. జమ్మలమడుగు మండలంలో పది పంచాయతీల్లో పోటీ నెలకొంది. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నాలుగు రోజుల నుంచి కవాతు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తెరాస తర్జనభర్జన