పన్నుల రాబడిలో తెలంగాణ నాలుగు శాతం వృద్ధి రేటు సాధించింది. నిర్దేశించిన మొత్తం లక్ష్యంలో 76 శాతం పన్నులు వసూలు కాగా... జీఎస్టీ రాబడులు అధికారుల అంచనాలకు తగ్గట్టు రాలేదు. గత ఏడాది జనవరి వరకు వచ్చిన జీఎస్టీ రాబడులతో ఈ ఏడాది జనవరి చివరి వరకు వచ్చిన రాబడులను బేరీజు వేస్తే రూ.1,326 కోట్లు తగ్గినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
అమ్మకం, పన్ను వసూళ్లలో నామమాత్రం వృద్ధిరేటు
రాబడుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ 19 శాతం, ఎక్సైజ్ శాఖ 16 శాతం వృద్ధి రేటు నమోదు చేశాయి. అమ్మకం, పన్ను వసూళ్లలో నామమాత్రం వృద్ధిరేటు నమోదు కాగా, కేంద్ర పన్నుల వాటా, గ్రాంటు ఇన్ ఎయిడ్లు గత ఏడాది కంటే మెరుగుపడ్డాయి. ఇతర పన్నులు, డ్యూటీలలో నామమాత్రం పెరుగుదల ఉంది. భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.
నిర్ధేశించిన లక్ష్యం చేరేనా!
రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాటికి రుణాల ద్వారా రూ.24,081కోట్లను సమీకరించుకోవాలని నిర్ణయించి... రూ.26,434 కోట్ల రుణాలను తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రూ.89,047కోట్లు వస్తుందని అంచనా వేయగా... రూ.67,574 కోట్లు వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు వచ్చిన మొత్తంతో పోల్చుకుంటే రూ.2,359 కోట్లు అధికం. వ్యయం అంచనాల్లో 77 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి, మార్చి నెలలో పన్నుల రాబడులు అధికంగా ఉంటాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులు వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.
ఇవీ చూడండి: నేడే డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎన్నికలు