ఎందరో ప్రాణ త్యాగాలతో జూన్ 2న సాధించుకున్న తెలంగాణ 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... రాష్ట్ర ప్రజానీకం అమరవీరులకు నివాళులర్పించింది. దశాబ్దాల కల నెరవేరిన రోజుకు గుర్తుగా... మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, యువకులు నాటి ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.
సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఐటీశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన ఆయన... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిద్దిపేటలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన ఆయన... కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. కొద్దిమంది సమక్షంలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, గ్రామీణ జిల్లా కలెక్టరేట్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ జెండావిష్కరించారు. మహబూబాబాద్‌లో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అమరవీరులకు నివాళులర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ జెండాను ఎగురవేశారు.
నిర్మల్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి , ఆచార్య జయంశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి... అమరులకు ఆయన నివాళులర్పించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జాతీయ జెండాను హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. మెదక్ కలెక్టరేట్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు.
ఇదీ చూడండి: KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి