సాగు వృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(State Home Minister Mahmood Ali)పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక రంగంలో జాతీయ వృద్ధిరేటు కంటే 6 రెట్లు అధిక వృద్ధిని తెలంగాణ నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలతో మాతాశిశు మరణాలు తగ్గాయని దక్షిణాది ప్రాంతీయ మండలి భేటీలో పాల్గొన్న మహమూద్ అలీ అన్నారు
షీ టీమ్స్, భరోసా కేంద్రాలతో మంచి ఫలితాలు..
నేర నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలపై దాడుల విషయంలో సైతం తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలతో మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. కరోనా వల్ల రెండేళ్లు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కేంద్ర, రాష్ట్రాల చర్యలతో చాలామంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.
సామరస్యంగా పరిష్కరించుకుంటాం..
తెలంగాణ, ఏపీ మధ్య విభజన అంశాలు చాలా వరకు పరిష్కారమయ్యాయని హోంమంత్రి అన్నారు. కొన్ని అంశాలు ఇంకా కోర్టులు, ఇతరచోట్ల పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగితా సమస్యలు ఏపీతో చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
తిరుపతి వేదికగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం..
ఏపీలో తిరుపతి వేదికగా నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి(Southern Zonal Council Meeting) సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సదస్సు.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. జోనల్ మండలి భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ భేటీతో 51 పెండింగ్ సమస్యలకు 40 పరిష్కారమైనట్లు ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు.
ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే..
ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి: szc meeting: ఇలాంటి సమావేశాలతో రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం: అమిత్ షా