Paddy Procurement in Karimnagar District : సాగునీటి సౌకర్యంతో కరీంనగర్ జిల్లాలో వరి సాగు ఏయేటికాయేడు పెరుగుతోంది. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రతి సీజన్‌లోనూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఎన్ని పెరిగినప్పటికీ రైస్‌మిల్లుల సామర్ధ్యం మాత్రం పెరగడం లేదు. కేంద్ర ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ, బియ్యం తీసుకొనే విషయంలో అనేక మార్పులు చేర్పులు చేపడుతోంది.
Paddy Procurement Issues in Karimnagar : కఠిన నిబంధనలతో నష్టపోవాల్సి వస్తోందని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. 2021-22 ఖరీఫ్‌లో రైస్‌మిల్లర్లు 3 లక్షల 96 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాల కారణంగా.. కేవలం 2 లక్షల 26వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చామని, ఇంకా ఒక లక్ష 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోనే ఉండిపోయాయని రైస్ మిల్లర్లు తెలిపారు.
2021-22 రబీలో 3 లక్షల 7వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కేవలం లక్ష 7వేల మెట్రిక్ టన్నులకే అనుమతి లభించింది. రెండు సీజన్లలో 3 లక్షల 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లుల్లోనే ఉందని చెబుతున్నారు. గత రెండు సీజన్లలో తీసుకున్న ధాన్యం వల్ల ఇప్పటికే లక్షల్లో నష్టపోయామని రైస్‌మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైస్‌మిల్లుల్లో స్థలం లేకపోవడంతో, ఆరుబయట నిల్వ చేశామని టార్పాలిన్లతో కప్పినప్పటికీ.. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. ధాన్యం నాణ్యత దెబ్బతిని నల్లగా మారిందని, ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితిలోనూ బియ్యం తీసుకొనే పరిస్థితి ఉండదంటున్నారు. ఇకనుంచి ఉప్పడు బియ్యం పూర్తిగా ఫొర్టిఫైడ్ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశాలు జారీ చేయడంతో, అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఈసారి వానాకాలం ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి తప్పకుండా సహకరిస్తామంటున్న రైస్‌మిల్లర్లు. తమ సమస్యలు పరిష్కరించేందుకు సర్కార్ చొరవ చూపాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: