ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రుణాల సమీకరణ సహా ఎలాంటి అప్పులకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. కేంద్రం నుంచి వాటాగా వచ్చే నిధులతోనే సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. రుణాలకు అనుమతి పొందేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అప్పులకు సంబంధించి కేంద్రం లేవనెత్తిన అంశాలు, అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానం ఇచ్చారు. కేంద్రం వెలిబుచ్చిన సందేహాలకు కూడా వివరణలు పంపారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులని కలిసి రాష్ట్ర వాదనను వినిపించారు. ఓ వైపు అప్పుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇప్పటికే మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం వాణిజ్య పన్నుల బకాయిల వసూలు కోసం ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగుతోంది. రాజీవ్ స్వగృహలో భాగంగా నిర్మించిన ఫ్లాట్లతోపాటు ఖాళీ స్థలాల అమ్మకం జరుగుతోంది. బండ్లగూడ, పోచారం ఫ్లాట్లతోపాటు చందానగర్, కవాడిపల్లి ప్రాంతాల్లోని భూముల అమ్మకానికి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
దశల వారీగా మిగిలిన వాటిని కూడా విక్రయించనున్నారు. ల్యాండ్ పూలింగ్‌పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రాంతాల్లోని భూములను సేకరించి అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా నిధులను రాబట్టుకోవాలన్నది సర్కార్ ఆలోచన. ఇప్పటికే వివిధ ప్రాంతల్లో ల్యాండ్ పూలింగ్ ప్రయాత్నాలను ప్రారంభించారు. అయితే కొన్ని చోట్ల ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకత వస్తోంది. దీంతో కాస్తా ఆచితూచి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిధుల సమీకరణ విషయమై సంబంధించి అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరచూ సమావేశం అవుతున్నారు. భూముల అమ్మకం, ల్యాండ్ పూలింగ్ సహా ఇతరాలపై అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశమై పురోగతిని సమీక్షిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: అబ్బుర పరిచే సూక్ష్మ కళ.. పెన్సిల్ మొనపై వేంకటేశుడు