కేసీ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు తరలించకుండా నియంత్రించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్‌స్టేషన్ నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్ నుంచి కేసీ కెనాల్‌కు అక్కడ నుంచి బేసిన్ వెలుపలకు ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అనుమతి లేకుండా తరలిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా నదీ జలవివాదాల ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ 31.9 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేలా నిలువరించాలని గతంలోనే కోరినా బోర్డు స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు.
తుంగభద్రనది నుంచి కేసీ కెనాల్‌కు కొంతమేర నీటిని తీసుకోవాల్సి ఉందని.. మిగిలిన తుంగభద్ర జలాలు కృష్ణాకు చేరాల్సిన అవసరం ఉందని వివరించారు. ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలు తరలిస్తోందని ఈఎన్సీ పేర్కొన్నారు. తుంగభద్రపై ఉన్న గురురాఘవేంద్ర సహా ఇతర ఎత్తిపోతల పథకాలకు అనుమతి లేదని, తక్షణమే వాటిని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీ కెనాల్ ద్వారా తీసుకుంటున్న నీరు లెక్కించాలని బోర్డును కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునే అన్ని పాయింట్ల వద్ద రియల్ టైం సెన్సార్లు ఏర్పాటు చేయాలని మరోసారి విజ్ఞప్తిచేసింది. అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసీ కెనాల్ ద్వారా 31.9 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా నిలువరించాలని..వారు వినియోగించే నీటిని పూర్తిస్థాయిలో లెక్కించాలని తెలంగాణ కోరింది. తద్వారా తుంగభద్ర, కృష్ణాలో న్యాయమైన వాటాను వినియోగించుకునే అవకాశం కలుగుతుందని లేఖలో ఈఎన్సీ మరళీధర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:
GVL On GRMB, KRMB: 'గెజిట్ అమల్లో ఏపీ, తెలంగాణ నిర్లక్ష్యం'
Letter to KRMB: 'పూర్తిస్థాయి నీరు వచ్చేలా ఆర్డీఎస్ ఎఫ్‌టీఎల్ పెంపును పరిశీలించండి'