మినీ పురపోరు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి ప్రతి నియమ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని... ఉల్లంఘనలను కఠినంగా పరిగణించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. మూడో తేదీన లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్ఈసీ... కరోనా నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు పరిశీలకులు, అధికారులను ఆయన అభినందించారు. లెక్కింపు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను పూర్తి చేసి మూడో తేదీ ఉదయం ఆరు గంటల్లోపు వైద్యాధికారుల నుంచి ధ్రువపత్రాలు పొందాలని తెలిపారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఉంటేనే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలని... లోపలికి వెళ్లే ముందు అందరినీ థర్మల్ స్కానర్లతో పరీక్షించాలని పార్థసారథి స్పష్టం చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ సమయంలో బయట ప్రజలు గుమికూడరాదని... స్ట్రాంగ్ రూమ్‌లు తెరువడం మొదలు, కొవిడ్ నిబంధనల అమలు సహా అన్నింటినీ వీడియోగ్రఫీ చేయించాలని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 5 టేబుళ్లకు మించరాదని... ఏ సమయంలోనూ 50 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరు మాస్కులు, సానిటైజర్లు, పేస్ షీల్డులు, గ్లౌసులు విధిగా ధరించాలని చెప్పారు.
రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందుకునే సమయంలో అభ్యర్థితో పాటు మరొక్కరినే అనుమతించాలని ఎస్ఈసీ తెలిపారు. పోలింగ్ రోజు కొవిడ్ ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల వివరాల నివేదికను సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి లేదని... ఒకవేళ నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పార్థసారథి హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో టీకా సమాచారం