రాష్ట్రంలో శాసన కమిటీల నియామకానికి రంగం సిద్ధమైంది. కమిటీల ఛైర్మన్లు, సభ్యుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 16 లేక 18న కమిటీలకు ఛైర్మన్లను, సభ్యులను ప్రకటించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభ, మండలిలో మొత్తం 21 కమిటీలు ఉంటాయి. వీటిలో సౌకర్యాలు, పర్యావరణ కమిటీలకు స్పీకర్ అధ్యక్షత వహించనున్నారు. మిగిలిన వాటికి సీఎం నియమించి స్పీకర్ సిఫార్సుకు పంపుతారు.
పదవుల్లేకుండా 103మంది...
శాసనసభ, మండలిలో కలిపి తెరాసకు 137మంది సభ్యులున్నారు. వీరిలో సీఎం కాకుండా 17మందికి మంత్రి పదవులు ఉన్నాయి. మండలి ఛైర్మన్, ఉప ఛైర్మన్, శాసనసభాపతి, ఉపసభాపతి, ఇద్దరు చీఫ్ విప్‌లు, సభలో ఆరుగురు, మండలిలో నలుగురు చొప్పున విప్‌లు ఉన్నారు. మొత్తంగా 34 మందికి పదవులు లభించాయి. ఇంకా 103 మంది మిగిలి ఉన్నారు. కొంతమందికి కార్పొరేషన్ల ఛైర్మన్ పదవిపై ఆసక్తి ఉంది. 19మందికి కమిటీల ఛైర్మన్లుగా అవకాశం ఇవ్వనున్నారు.
మజ్లిస్‌కు పీఏసీ ఛైర్మన్?
పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేదు. తెరాస మిత్రపక్షమైన మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి మొదటి వరసలోని విపక్ష స్థానం కేటాయించారు. తాజాగా పీఏసీ ఛైర్మన్ పదవిని ఆ పార్టీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మజ్లిస్ నుంచి ఈ మేరకు వినతి వచ్చింది. ఈ అంశంపై సీఎం మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?