గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసినందున నేరుగా చర్చ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ఉభయసభల్లోనూ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. శాసనసభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బలపరుస్తారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా విప్ ఎం.ఎస్. ప్రభాకర్ బలపరుస్తారు. సభలోని మిగతా పక్షాలు కూడా చర్చలో పాల్గొంటాయి. అనంతరం చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారు.
ఉభయ సభల ముందు పలు బిల్లులు...
ఆర్డినెన్స్‌ల స్థానంలో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దాని స్థానంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లు ప్రవేశ పెడతారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టానికి కూడా సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఆ స్థానంలోనూ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెడతారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు సంబంధించిన వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్, సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన వార్షిక నివేదికను మంత్రి జగదీశ్ రెడ్డి ఉభయ సభల ముందు ఉంచుతారు.
ఇవీ చూడండి: 20 వరకు బడ్జెట్ సమావేశాలు.. 8న పద్దు