రసాయన ఎరువుల వినియోగం ప్రపంచ సగటు ఎకరానికి 78.4 కిలోలు, దేశ సగటు 51.2 కిలోలు కాగా... రాష్ట్ర సగటు 173 కిలోలు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పట్టు పరిశ్రమశాఖ కార్యాలయంలో... వానాకాలం సీజన్ సంబంధించి ఎరువుల సరఫరాపై కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
మోతాదుకు మించి వాడొద్దు
మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, దీని వల్ల నేల స్వభావం దెబ్బతినడం, తెగుళ్లు, పురుగుల బెడద, ఎదురవుతున్న ఇతర ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. గతేడాది ఇదే సమయంలో ఈ రోజు వరకు 79.94 లక్షల ఎకరాలు సాగు చేయగా... ఈ ఏడాది కోటి 17 లక్షల ఎకరాలు సాగైందని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
అసత్యాలను నమ్మొద్దు
ఈ వానా కాలానికి సంబంధించి తెలంగాణకు... కేంద్రం 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించగా... ఈ సీజన్‌లో ఇవాళ్టి వరకు 16.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఈ సీజన్‌లో వరి, కంది, పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపారని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని... కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : బైక్ లేకున్నా ఫొటో పెట్టి రూ.30 వేలు అన్నాడు... రూ.73వేలు దోచాడు