Registration Value In Telangana: రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అనేక రకాల ప్రామాణికాలను పరిగణలోకి తీసుకుంది. గత ఏడాది జులై నెలలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్టుమెంట్లకు నిర్దేశించిన శాతాల్లో ఒకే రకమైన రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ... అప్పట్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం పెంచింది. అయితే ఈసారి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల జోలికి అసలు వెళ్లలేదు. రిజిస్ట్రేషన్ విలువలను మాత్రమే పెంచింది.
ఈసారి గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని ఆస్తులు, భూముల బహిరంగా మార్కెట్ విలువలు అనూహ్యంగా పెరిగిన ప్రాంతాలను ప్రాధాన్యత కలిగినవిగా, మిగిలిన వాటిని సాధారణమైనవిగా రెండు రకాలుగా విభజించింది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులకు చెందిన బహిరంగ మార్కెట్ విలువలను గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా సేకరించింది. ఎక్కడెక్కడ బహిరంగా మార్కెట్ విలువలకు, రిజిస్ట్రేషన్ విలువలకు వ్యత్యాసం అధికంగా ఉందో లెక్క తేల్చింది. ఎందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా అంతరం ఏర్పడింది.. అందుకు గల కారణాలు ఏంటి.. తదితర అంశాలపై అధ్యయనం చేసింది.
ఇవే కారణాలు..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల మరమ్మతులు చేయడం, సకాలంలో వర్షాలు పడడం లాంటి కారణాలతో నీటి లభ్యత పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సాగునీరు అందుబాటులోకి రాగా మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పైకొచ్చాయి. చాలాచోట్ల పంటల సాగుకు యోగ్యంకాని భూములు సైతం వ్యవసాయ పొలాలుగా మారడంతో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. అదే విధంగా ఇంకొన్ని ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, పట్టణీకరణ, గృహావసరాలు పెరగడం లాంటి కారణాల వల్ల కూడా భూములు, ఖాళీ స్థలాలు విలువలు అనూహ్యంగా పెరిగాయి.
అక్కడ ఎక్కువ విలువ..
ఇలా రకరకాల కారణాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల బహిరంగ మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో చలామణి అవుతున్న బహిరంగ మార్కెట్ విలువలకు, రిజిస్ట్రేషన్ విలువలకు భారీగా అంతరం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాలను ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి అక్కడ నిర్దేశించిన శాతాల కంటే ఎక్కువ శాతం విలువలను పెంచింది.
సగటున వ్యవసాయ భూముల విలువ 50 శాతంపైకి..
రాష్ట్రంలో సగటున వ్యవసాయ భూముల విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలు విలువలు 35 శాతం, అపార్టుమెంట్ ప్లాట్ల విలువలు 25 శాతం లెక్కన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పెంచింది. అయితే అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ శాతాలు పెరిగాయి. ఎకరా 5 కోట్లు రూపాయిలు లోపు విలువ కలిగిన వ్యవసాయ భూముల విలువలు యాభై శాతం, 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయిలు మధ్య విలువ కలిగిన వ్యవసాయ భూముల విలువలు 20 శాతం, పది కోట్ల రూపాయిలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన వ్యవసాయ భూముల విలువలు 10 శాతం లెక్కన పెంచింది.
ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ విలువపై 60 శాతం..
ఇవి కాకుండా అధిక ప్రాధాన్యత కలిగిన 589 గ్రామాలను గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూముల విలువలు యాభై శాతం కంటే ఎక్కువ పెంచింది. ఇందులో 472 గ్రామాల పరిధిలోని భూములపై 75 శాతం, 90 గ్రామాల పరిధిలోని భూములపై 100 శాతం, 77 గ్రామాల పరిధిలోని భూములపై 125 శాతం, 42 గ్రామాల పరిధిలోని భూములపై 150 శాతం లెక్కన విలువలను పెంచింది. ఖాళీ స్థలాల విలువ చదరపు గజం 20 వేలు రూపాయిలలోపు ఉన్నట్లయితే 35 శాతం, చదరపు గజం 20 వేల నుంచి 40 వేల రూపాయిల మధ్య ఉన్నట్లయితే 15 శాతం, చదరపు గజం 40 వేలు రూపాయిలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే 10 శాతం లెక్కన విలువలు పెరిగాయి. అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధిక ప్రాధాన్యత కలిగిన 6,364 ప్రాంతాల్లో ఈ నిర్దేశించిన శాతాల కంటే ఎక్కువ పెంచింది. ఇందులో 4,722 ప్రాంతాలల్లో చదరపు గజం ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ల విలువపై 40 శాతం, 1155 ప్రాంతాలల్లో చదరపు గజం.. ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ల విలువపై 50 శాతం, 487 ప్రాంతాలల్లో చదరపు గజం ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ విలువపై 60 శాతం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది.
అపార్టుమెంట్లు, ఇళ్లకు సంబంధించి చదరపు అడుగు రిజిస్ట్రేషన్ల విలువను 25 శాతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పెంచింది. అయితే చదరపు అడుగు 4,000 రూపాయిలు కంటే తక్కువ ఉంటే 25 శాతం, అంతకంటే ఎక్కువ విలువ ఉంటే 15 శాతం పెరిగాయి. అదే విధంగా 72 ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్రమే 10 శాతం పెంచింది. మిగిలిన ఫ్లోర్లకు ఈ పెంపు వర్తింప చేయలేదని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీచూడండి: