Stalls run by PMEGP loan assisted in HYD: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ మార్కెటింగ్‌లో భాగంగా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను ఏర్పాటుచేసింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం-ఈజీపీ ద్వారా రుణం పొంది వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఆ స్టాళ్లు ఏర్పాటు చేశారు. పేపర్ ప్లేట్లు, కుమ్మరి వాళ్ల ఎలక్ట్రిక్ వీల్స్, తేనె, చింతపండు ప్రాసెసింగ్, అగరుబత్తీలు, బయోగ్యాస్ తదితర స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వీల్ ద్వారా కుండలు తయారు చేయడం దూది ద్వారా దారం తయారీని ఆసక్తిగా తిలకిస్తూ వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు.
తమ వ్యాపార అభివృద్ధికి పీఎం-ఈజీపీ పథకం కింద రుణసహకారం అందించడంతోపాటు అధికారులు అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారని స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. తమవ్యాపారంతో మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం సహాయం పొందవచ్చని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ అధికారులు తెలిపారు.
అత్యధికంగా 35శాతం వరకు దాదాపుగా పదిహేడున్నర లక్షల వరకు రాయితీ వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వందలాది యూనిట్లు వచ్చాయని వివరించారు. గ్రామోద్యోగ్ వికాస యోజన కింద అర్హులైన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని మరింత సరళీకరించినట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల అధికారులు తెలిపారు. రుణం, రాయితీ సొమ్మును ప్రభుత్వం పెంచినట్లు వివరించారు.
ఇవీ చదవండి: