Students Reunion after 50 Years : హైదరాబాద్‌లోని హైదర్‌గూడ సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో 1972 నాటి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. పాఠశాల వదిలి వెళ్లి 50 ఏళ్లు దాటిన సందర్భంగా.. 'జూబ్లీ రీయూనియన్' పేరుతో స్నేహితులందరూ ఒకే చెంతకు చేరారు. బడి ప్రాంగణమంతా కలియ తిరిగి.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు.
విద్యార్థుల మాదిరిగా ఏకరూప దుస్తుల్లో వచ్చి.. తాము చదివిన తరగతి గదుల్లో, ఆడుకున్న మైదానంలో ఉల్లాసంగా, ఆనందంగా గడిపారు. తమకు చదువు చెప్పిన గురువులను ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు ఆనాడు గురువులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించారని పూర్వ విద్యార్థులు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత అందరం కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
జీవితంలో సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి, విద్యా ప్రాముఖ్యతను ప్రస్తుత విద్యార్థులకు వివరించారు. అలాగే నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. సెయింట్ పాల్స్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూ.18 లక్షలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పేద విద్యార్థుల పైచదువుల కోసం రూ.9 లక్షల ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమ్మేళనంలో 108 మందిలో 65 మంది పాల్గొన్నారని.. మిగతా వారు విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయారని పూర్వ విద్యార్థులు తెలిపారు. అర్ధ శతాబ్ధం తర్వాత ఆనాటి మిత్రులను కలుసుకోవడంతో ఓ మధురానుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: