SSC Exams: రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచి జూన్ 1 వరకు జరగనున్న పరీక్షల కోసం 2,861 కేంద్రాలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల్లో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 2,861 చీఫ్ సూపరింటెండెంట్లు, 2,861 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 33 వేల ఇన్విజిలేటర్లు, 144 ఫ్లయింగ్ స్క్వాడ్లు, నలుగురు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం ఎనిమిదిన్నర నుంచి 9.35 గంటల వరకు కేంద్రాల్లోకి విద్యార్థులు వెళ్లవచ్చునని అధికారులు తెలిపారు. పరీక్ష తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుందని... 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ వరకు విద్యార్థులను లోనికి అనుమతిస్తామన్నారు.
పాఠశాలల నుంచి దాదాపు విద్యార్థులందరూ హాల్ టికెట్లు తీసుకున్నారని... అవసరమైతే https://www.bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కొవిడ్ ప్రభావం వల్ల ఈ ఏడాది 70శాతం సిలబస్‌తోనే ప్రశ్నపత్రాలు రూపొందించారు. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరింటికి కుదించడంతో పాటు ప్రశ్నల్లో ఛాయిస్ పెంచారు. జనరల్ సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్త్రం ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు వేర్వేరుగా ఇస్తారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచనల మేరకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. పరీక్ష సిబ్బందికి కేంద్రాల్లో ఫోన్లు, స్మార్ట్ వాచీలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: