Srinivas Goud Warning on Tourism Lands Lease Owners: పర్యాటక శాఖకు చెందిన భూముల్ని లీజుకు తీసుకుని నిబంధనలు పాటించని యాజమానుల నుంచి.. రూ.1,000 కోట్ల విలువైన స్థలాల లీజును రద్దు చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రద్దు చేసిన భూములను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పర్యాటక శాఖ అధికారులు ఏడాది కాలంలో రూ.50 కోట్ల పాతబకాయిలను వసూలు చేశారని వివరించారు. మిగతావాటి మీద లీజు నిబంధనలు పాటించని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రద్దు చేసిన భూముల వివరాలను ఆయన తెలిపారు. శామీర్‌పేట్‌లోని జవహర్‌నగర్ సర్వే నెంబర్ 12లో.. ఓ సంస్థ 2004లో 130 ఎకరాల భూమిని తీసుకోందన్నారు. లీజు నిబంధనలు పాటించని కారణం చేత సంస్థపై చర్యలు తీసుకుని.. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అదే విధంగా సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ పక్కన ఉన్న 4600 గజాల విలువైన భూమిని.. మరో సంస్థ లీజుకు తీసుకుందని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
సదరు సంస్థ నిబంధనలు పాటించకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతుందని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ క్రమంలోనే లీజును రద్దు చేస్తూ తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏడాది కాలంగా టూరిజం అధికారుల కృషి వల్ల పర్యాటక శాఖకు గత బకాయిలు రూ.50 కోట్లు వసూలు అయ్యాయని వివరించారు. పర్యాటక శాఖకు చెందిన భూములను తీసుకొని ప్రాజెక్టులు చేపట్టకుండా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే సంస్థలపై చర్యలు చేపట్టాలని శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక శాఖకు సంబంధించిన వందలాది ఎకరాల భూములు ఇతరులకు ధారాదత్తం చేశారు. ఫ్యాక్టరీలు పెట్టకపోయినా భూములు ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవరైతే భూములు తీసుకొని వాటిని ఉపయోగించడం లేదో వారి వద్ద నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాం. ఈ క్రమంలోనే వెయ్యి కోట్ల విలువైన రెండు స్థలాల లీజు రద్దు చేశాం. ఏడాదిలో రూ.50కోట్ల పాతబకాయిలు వసూలు చేశాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే సంస్థలపై చర్యలు తప్పవు"- శ్రీనివాస్‌గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: Governor Tamilisai: 'వ్యవసాయ అనుబంధ రంగాల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి'
Digigyan project: పాఠశాల విద్యార్థినుల తొలి అంకుర సంస్థ.. మంత్రి కేటీఆర్ రూ.8 లక్షల సాయం
'పాపులారిటీ కోసమే అతీక్ హత్య- నిందితులంతా నిరుద్యోగులు, డ్రగ్ బానిసలే'