Sri Rama Navami Shobhayatra: శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహించే మార్గంలో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శోభాయాత్ర కొనసాగే సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రేపు ఉదయం 11గంటలకు మంగళ్ హాట్‌లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. బోయగూడ కమాన్, పురానాపూల్, జూమెరాత్ బజార్, చుడి బజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది.
6.5 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర రాత్రి 10గంటలకు ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాహనదారులు శోభాయాత్రకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 18+ వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్- ఆదివారం నుంచే...