Spouse Teachers Transfers Issue in Telangana : భర్త ఒక జిల్లాలో.. భార్య మరో జిల్లాలో విధులు నిర్వహిస్తుండటంతో ఉపాధ్యాయ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లల ఆలనా, పాలనా చూసేవారు లేక.. వయస్సు మీద పడిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారని స్పౌజ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 నెలలుగా నిరసనలు చేస్తూ కుటుంబాలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే బదిలీలు చేపట్టాలని.. నేడు ఇందిరాపార్కులో మహాధర్నా చేపట్టనున్నారు.
ఓపీఎస్ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుతో అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు.. స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీల కోసం నినదించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీలు దీర్ఘకాలంగా నిలిచిపోయాయన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని.. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
జీవో 317, స్పౌజ్ బదిలీలపై టీచర్ల పోరుబాట
Spouse Teachers Transfers Issue : గతేడాది జనవరిలో 19 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు, మిగతా 13 జిల్లాల స్కూల్ అసిస్టెంట్‌లను మాత్రమే బదిలీ చేసి.. తమను ఎందుకు వదిలేశారని నిరసన చేపట్టారు. నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డితో పాటు.. మజ్లీస్ ఎమ్మెల్యేలకు మహిళా ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమై మొరపెట్టుకున్నారు. బదిలీలు నిర్వహించి తమకు విముక్తి కల్పించాలని.. మహిళ, పురుష ఉపాధ్యాయులు రోదనల మధ్య, నమస్కారాలతో మంత్రులను వేడుకున్నారు. శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నామని.. ఈ బాధలు ఇంకా భరించలేమన్నారు. తమ కుటుంబాలు శోకసముద్రంలో ఉన్నాయని దయచేసి సమస్య త్వరగా పరిష్కరించమని అభ్యర్థించారు.
విద్యా విధానంలో సాంకేతిక కారణాల వలన బదిలీలలో 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో ప్రతి రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ.. స్పౌజ్ ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నామని తెలిపారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు విద్యాబోధనపై ప్రభావం చూపుతున్నాయని.. సమస్యను పరిష్కరించి వెంటనే బదిలీలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. వీరిలో చాలా మందికి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉండగా.. 25 సంవత్సరాల పైబడిన సర్వీసు ఉందని పేర్కొన్నారు.
ఇటు కుటుంబానికి, అటు విద్య బోధనకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేక.. మహిళా ఉపాధ్యాయులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది మహిళా ఉపాధ్యాయులకు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో మెడికల్ సెలవులలో సైతం వెళ్తున్నారని.. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని వెంటనే 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.
Teachers Protest in Hyderabad : ఒకే జిల్లాకు బదిలీ చేయలంటూ.. స్పౌజ్ టీచర్ల ఆందోళన
స్కూల్ అసిస్టెంట్‌లను మాత్రమే బదిలీ చేశారు.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి?