రాజధానిలో 158 కి.మీ. మేర ఉన్న ఓఆర్‌ఆర్‌పై మొదట్లోనే అతి వేగాన్ని నిషేధించారు. ఓఆర్‌ఆర్ విస్తరించి ఉన్న సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతేడాది 2 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 90 మంది చనిపోయారు. 350 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మొత్తం నాలుగు లైన్లలో రెండు లైన్లలో వేగపరిమితిని అమల్లోకి తెచ్చారు. ఒక లైన్‌లో 100 కి.మీ., రెండో లైన్‌లో 80 కి.మీ. పరిమితిని విధించారు. అంతకు మించి వెళితే జరిమానా విధిస్తున్నారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు ఆరు స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు.
ఉల్లంఘనదారులను వీటి ద్వారా గుర్తించి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. రోజూ ఈ రోడ్డుపై తిరిగే వాహనదారుల్లో చాలా మంది నెలకు రూ.10 వేలు ఆపైన జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. అతి వేగం నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నియంత్రించలేకపోతున్నారు. డిసెంబరులో 400 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు ఈ పరిస్థితిని నివారించి, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 158 కి.మీ. మేర నిఘాను పెట్టడానికి సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది.
అడుగడుగునా నిఘా
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్యర్యంలో పని చేసే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రెండు కి.మీ.కు ఒకటి చొప్పున సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 1200 కెమెరాలను సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. గ్రోత్‌కారిడార్ కార్యాలయంలోని సెంటర్‌కు ఇది అనుసంధానం అవుతుంది. మితిమీరిన వేగంతో వెళ్లేవారిని గుర్తించి వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇస్తుంది. వెంటనే పోలీసులు రూ.1000 చొప్పున చలానాలు జారీ చేస్తారు. హెచ్చరించేందుకు మైక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్‌ఆర్ మీద ఆగిపోయిన వాహనాలకు తోడ్పాటు అందించేందుకు ఆరు పెట్రోలింగ్ టీంలను ఏర్పాటు చేశారు.
ప్రమాదాలను నిరోధించేందుకే
ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలను నివారించి, మృతుల సంఖ్యను తగ్గించేందుకు సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవస్థ 5 నెలల్లో అమల్లోకి రానుంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. - విజయ్‌కుమార్, ట్రాఫిక్ విభాగం డీసీపీ, సైబరాబాద్.
ఇదీ చూడండి: రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి