కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణుల హెచ్చరికలతో హైదరాబాద్ జంటనగరాల్లోని అనేక ప్రైవేట్ సంస్థలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి. ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగులకు టీకా సదుపాయం కల్పిస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నాయి.
ప్రముఖ ఐటీ కంపెనీ మౌరిటెక్ సాఫ్ట్వేర్ సంస్థ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మంగళవారం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉద్యోగులందరికీ కొవిషీల్డ్ టీకాలను వేయిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ స్వర్ణ అన్నపురెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల నుంచి మంచి స్పందన వస్తోందని డైరెక్టర్ వరలక్ష్మి వెల్లడించారు.
నగరంలో ఐటీ రంగంలో దాదాపుగా 6.5 లక్షల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం 50 శాతం మంది మాత్రమే నేరుగా కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. మిగతా వారు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నాటికి ఐటీ ఉద్యోగులందరికీ రెండు డోసుల టీకాలను పూర్తి చేయాలనే లక్ష్యంగా ఆయా సంస్థలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
ఇదీ చదవండి: Cm Kcr: ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి కావాలి..