రాజశేఖర్ మదిలో ఉండే ఆలోచనలకు, చేసిన పరిశోధనలకు ప్రతిరూపమే..ఇంట్లో గది నిండా ఉన్న అవార్డులు, ప్రశంసా పత్రాలు. గుంటూరులో పుట్టి పెరిగిన ఈ యువ ఇంజినీర్.. ఇంటర్ వరకూ ఇక్కడే చదివాడు. తమిళనాడులోని సత్యభామ విశ్వవిద్యాలయంలో బీటెక్ చేశాడు. అక్కడే రాజశేఖర్ జీవితం మలుపు తిరిగింది. సంక్లిష్టమైన ఆగిపోయిన పరిశోధనలపై దృష్టి సారించాడు. తొలి ఏడాదే ‘వైర్‌లెస్ ఎలక్ట్రిసిటీ అంశంపై పరిశోధన పత్రం రాశాడు.
పరిశోధనల్లో ఘటికుడు
అయితే పరిశోధనా పత్రానికి కావాల్సిన కనీస అర్హతలు లేవని అధ్యాపకులు దాన్ని పక్కన పెట్టేశారు. దాంతో మరింత పట్టుదలతో ఎంబడెడ్ సిస్టం అంశంపై మరో పత్రాన్ని సిద్ధం చేశాడు రాజశేఖర్. 6నెలల్లోనే కొత్తపరిశోధనపత్రం రూపొందించిన రాజశేఖర్ ప్రతిభ సంబంధిత అధ్యాపకుడిని ఆశ్చర్యపరిచింది. ఈ పరిశోధనలో తనూ భాగమయ్యేలా చేసింది. ఈ పరిశోధనా పత్రం అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితం కావటంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
టైమ్ ట్రావెల్
ఇంజినీరింగ్ సమయంలో ఎక్కడ సైన్సు వర్క్‌షాప్‌లు, సదస్సులు జరిగినా హాజరయ్యే వాడు రాజశేఖర్. ప్రముఖ శాస్త్రవేత్తలు, అధ్యాపకుల ప్రసంగాలు వినేవాడు. బీటెక్ 3వ సంవత్సరంలో ఉండగా విశ్వవిద్యాలయంలో ఇస్రో ఆధ్వర్యంలో ఓ సదస్సు జరిగింది. ‘టైమ్ ట్రావెల్’ ఇతివృత్తంతో రాజశేఖర్ ఓ పోస్టర్ రూపొందించాడు. ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఆ పోస్టర్ చూసి మెచ్చుకోవడమే కాక మరిన్ని పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించాడు.
7 పరిశోధనా పత్రాలు
ఇప్పటివరకూ రాజశేఖర్ రూపొందించిన 7 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో చోటు దక్కించుకున్నాయి. సెన్సార్లు, కృత్రిమమేధతో పనిచేసే ఆటోమేటెడ్ వీల్‌ఛైర్ పై ఓ పత్రం రూపొందించాడు. కాంతివేగంతో సమానంగా ప్రయాణించడంపై మరో పరిశోధన చేశాడు. సౌర శక్తిని సమర్థంగా వినియోగించుకోవటం, బాణాసంచా తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు నివారణపై పరిశోధనా పత్రాలు సమర్పించాడు...రాజశేఖర్.
ఫోన్ల పరిమాణం సగానికి
ప్రాంగణ నియామకాల్లో హెచ్‌సీఎల్‌లో కొలువు సంపాదించుకున్న రాజశేఖర్... బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కాలర్స్ నుంచి యువ పరిశోధకుడిగా పురస్కారం అందుకున్న రాజశేఖర్.. ఐఎన్ఎస్సీకి పరిశోధన పత్రాల సమీక్షకుడిగానూ గతేడాది ఎంపికయ్యాడు. తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే కెపాసిటర్లపై పరిశోధనలు చేసిన రాజశేఖర్..ఈ ప్రయోగం ఫలిస్తే.. స్మార్ట్ ఫోన్ల పరిమాణం సగానికి తగ్గించవచ్చునని అంటున్నాడు.
రాజశేఖర్ లక్ష్యం
వినూత్న ఆలోచనల్ని ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలుగా మలచాలనేది..రాజశేఖర్ లక్ష్యం. అవసరమైన నిధులు అందుబాటులోకి రాగానే కంపెనీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నా డు. అందుకోసమే పరిశోధనలతో పాటు ప్రోగ్రామింగ్, అడ్మినిస్ట్రేషన్ పైనా దృష్టి పెట్టాడు.
యువ శాస్త్రవేత్త
పరిశోధనలతో పాటు విభిన్న అభిరుచులు రాజశేఖర్ సొంతం. చిత్రాలు గీయటం, ఫొటోలు తీయటంలోనూ ప్రత్యేకత చూపుతున్నాడు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కెమెరాతో వైవిధ్యమైన చిత్రాల్ని బంధిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటాడు. రాజశేఖర్ ఫోటోగ్రాఫర్‌గా కూడా పలు అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న మరో 3 పరిశోధనాంశాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు...ఈ యువ శాస్త్రవేత్త.
ఇదీ చూడండి: oysc ngo: సామాజిక సైనికులు... సేవే వారి పథం!!