Kamareddy Sand Mafia: కామారెడ్డి జిల్లా బీర్కూర్ పరిధిలోని మంజీరా నదిలో ప్రభుత్వం అధికారికంగా ఆరు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అక్రమ రవాణను అరికట్టేందుకు... ఆన్‌లైన్‌లో డీడీలు చెల్లించిన వారికి కేటాయింపులు చేస్తోంది. ఇసుక రీచ్‌లు నిర్వహించేందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ గుత్తేదారులకు అప్పగించింది. వే-బిల్లుల ఆధారంగా రీచ్‌ల వద్ద ఇసుక నింపి పంపాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. బీర్కూర్ పరిధిలో బిర్కూర్, కిష్టంపేట, దామరంచ, బరంగెడ్గి ప్రాంతాల్లో అక్రమ దందా జోరుగా సాగుతోంది.
అనుమతులకు మించి
ఇసుక రీచ్‌లలలో గుత్తేదారులు అనుమతులకు మించి తోడేస్తున్నారు. 30 లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఉండగా.. ఆ పరిమితి ఎప్పుడో దాటేశారు. కేటాయించిన రీచ్‌ల నుంచి బయటకు వెళ్లి రాత్రివేళల్లో తమ రీచ్‌లలో డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రీ పగలూ తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లారీల్లోనూ ఓవర్ లోడ్ ప్రధానంగా కనిపిస్తుంది. పరిమితికి మించి లారీల్లో ఇసుక నింపుతూ అదనంగా దండుకుంటున్నారు. ఇటీవల వే-బిల్లులు లేకుండా, అధిక లోడుతో వెళ్తున్న తొమ్మిది ఇసుక లారీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయినా గుత్తేదారుల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది కాకుండా ఒక టోకెన్‌పై రెండు మూడు ట్రిప్పులు తరలిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వే-బిల్లులు చెల్లిస్తే ఒకసారే ఇసుక నింపాలి. అదనంగా డబ్బులు తీసుకుని అదే టోకెన్‌పై రెండు నుంచి మూడు ట్రిప్పులు నింపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
జోరుగా జీరో దందా
అధిక శాతం ఇసుక జీరో కింద తరలుతోంది. పగటి పూట ఇసుక రీచ్‌ల వద్ద రెండు, మూడు లైన్లలో లారీలు ఉంటాయి. ఇందులో DDలు చెల్లించినవి ఒక వైపు, ఒక వే-బిల్లు మీద మరోసారి ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చినవి మరో లైను, అసలు వే-బిల్లే లేకుండా వచ్చిన లారీలు మరో లైన్‌లో ఉంటాయి. DDలు కట్టిన వారిని నిలుపుదల చేసి మరీ... పైసలు ఇచ్చివారికి ఇసుక నింపుతూ జీరో దందాకు తెగబడుతున్నారు. ఆ సొమ్మును ఇసుక రీచ్‌ల నిర్వాహకులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అత్యధికంగా ఇసుకంతా రాత్రి పూటనే తరలిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉన్నాం. బరంగెడ్గిలో రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసు అధికారుల సహకారంతో ఉక్కుపాదం మోపుతాం. రాత్రివేళల్లో వీఆర్‌ఏలను నిఘా పెట్టాలని నిర్ణయించాం. గ్రామస్థులు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.
- రాజు, తహసీల్దార్, బీర్కూర్
ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సంబంధిత అధికారులను ఇసుక రీచ్‌ల గుత్తేదారులు తమకు అనుకూలంగా మల్చుకోవడంతో దందా ఆటంకం లేకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇసుక జీరో దందాపై అధికారులు దృష్టి పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో యుద్ధం.. స్వస్థలాలకు రావడానికి తెలుగు విద్యార్థుల బెంబేలు