రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్ వైజర్లు ఇలా రకరకాల విధులు నిర్వహిస్తున్నారు. బస్సులు పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్ల ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవడం లేదు. పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు. ఫలితంగా వంద రూపాయల కంటే తక్కువ నుంచి వెయ్యి లోపు జీతం వచ్చిన ఉద్యోగులు ఉన్నారు. నాలుగు నుంచి ఐదు వేలకే చాలా మంది జీతాలు పరిమితమయ్యాయి.
ఎలా బతుకుతారు?
భద్రాచలం డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ. 7 వేతనం మాత్రమే వచ్చిందని పే స్లిప్ చూపించారు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ. 57 వచ్చిందని వాపోగా.. ఇంకొక ఉద్యోగి 77 రూపాయలతో ఏం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో ఉద్యోగి తనకు రూ. 999 మాత్రమే వచ్చాయన్నారు. ఈ జీతాలపై ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించింది.
ఆందోళన..
రాష్ట్రంలో లాక్‌డౌన్ తర్వాత మే 19 నుంచి బస్సులు నడుస్తున్నాయి. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడుపుతున్నారు. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం కావడం వల్ల... డ్యూటీకి రిపోర్టు చేసినా... సెలవు తీసుకొమ‌్మంటున్నారని డ్రైవర్లు, కండక్టర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు. లేదంటే గైర్హాజర్‌గా నమోదు చేస్తున్నారని చెబుతున్నారు. మే 19 నుంచి జూన్ 16 మధ్య కాలంలో 8 నుంచి 20 రోజులపాటు చాలామందికి డ్యూటీలు దొరకలేదని యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 1న పూర్తి జీతం ఇచ్చినా... నాలుగు నుంచి ఐదు వేలకు మించి రాలేదంటున్నారు.
పూర్తి వేతనం వచ్చేలా..
డ్యూటీకి వచ్చినా... సెలవు, గైర్హాజరుగా నమోదు చేసి జీతం కోసేయడం బాధాకరమని ఆర్టీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టు చేసిన వారందరికి పూర్తి వేతనం వచ్చేలా చూడాలని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇవీ చూడండి: బిగ్ బీ, అభిషేక్‌కు కరోనా- ఆసుపత్రికి తరలింపు