Kothapalli Waterfall : పర్యాటకులు సందడిగా గడుపుతున్న ఈ జలపాతం ఎక్కడో లేదు..! ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు దగ్గరలోని కొత్తపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ బండరాళ్ల మధ్య ఈ జలపాతం దర్శనమిస్తుంది. 2010 వరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఇక్కడున్న ఈ యువతే దీనిని ఓ పర్యాటక ప్రదేశంగా వెలుగులోకి తీసుకువచ్చారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న యువకుల చదువులు అంతంతమాత్రమే. గ్రామస్థులంతా అడవి తల్లిని నమ్ముకుంటూ ఫలసాయాలు విక్రయిస్తూ జీవించేవారు. వీరికి ఒకానొక రోజున కొండల నడుమ జలపాతం కనిపించింది. ఊరంతా కలిసి దీని వద్దకు చేరుకునేందు మార్గాన్ని సృష్టించారు. చందాలు వేసుకుని మట్టితో రహదారి.. చెట్లతో కర్ర వంతెనలు కట్టారు.
ఈ జలపాతం పర్యాటకుల డెస్టినేషన్‌గా మారిపోయింది..
ఈ జలపాతం అందాలు.. ఆ నోటా ఈ నోటా పడి విశాఖ అంతటా వ్యాపించింది. దీంతో పర్యాటకులు రావడం మెుదలుపెట్టారు. ఐటీడీఏ సహకారంతో గ్రామస్థులు ప్రవేశ రుసుము 20 రూపాయలు వసూలు చేయడం మెుదలుపెట్టారు. అలాగే, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ బృందంగా ఏర్పడి పర్యవేక్షణ చేస్తున్నారు. దశాబ్దాకాలంగా ఇక్కడ ఒక్క ప్రమాదం కూడా జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు ఈ యువకులు ఎంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నారో. ఈ యువ బృందానికి.. అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరి నారాయణన్ సహకారం అందించారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన మండలాల సహాయార్థం విడుదల చేసిన నిధులను.... వన బంధు కల్యాణ్ యోజన కింద కోటి రూపాయలు ఈ జలపాతానికి కేటాయించారు. దీంతో.. యువత రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం మెుదలుపెట్టారు. అలా.. కొత్తపల్లి జలపాతం పర్యాటకుల డెస్టినేషన్‌గా మారిపోయింది.
మనుషులు వెళ్లలేని స్థితి నుంచి... ఎకో టూరిజం కేంద్రంగా..
20 మంది సభ్యులు గల యువ బృందం.. కొత్తపల్లి ఎకో టూరిజం యూనియన్‌గా అవతరించింది. ఉద్యోగాలు అంటూ పట్నం బాట పట్టకుండా.. తమ సమీప జలపాతాన్ని ఉపాధి కేంద్రంగా మార్చుకున్నారు. ఐటీడీఏ వారి సహకారంతో దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ అందాల్ని వీక్షించడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నారు. దీంతో స్థానికంగా అనేక దుకాణాలు వెలిశాయి. ఫలితంగా.. చిన్న, పెద్ద వ్యాపారం చేసే వారికి ఇదో ఉపాధి కేంద్రంగా మారిపోయింది. పెద్ద అడవిలో ఉండే కొత్తపల్లి జలపాతానికి ఒకప్పుడు మనుషులు వెళ్లలేని పరిస్థితి ఉండేది. స్థానిక యువత చొరవతో నేడు ఎకో టూరిజం కేంద్రంగా అవరించింది. నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మారిపోయింది.
ఇదీ చూడండి : Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం