Roads Damaged in AP: ఇదీ ఇక్కడి రహదారుల పరిస్థితి.! ఇదెక్కడో మారుమాల రోడ్డుకాదు.! ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుంచి అమలాపురంవెళ్లే రహదారి. ఈ మార్గంలో రాకపోకలు సాహసమే..! క్షేమంగా గమ్యస్థానం చేరాలని.. వాహనదారులు దేవుణ్ని తలచుకునిగానీ రోడ్డెక్కడంలేదు. రాజమహేంద్రవరంతో పాటు విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి వాహనాలు కోనసీమలోకి(Konaseema Roads Damaged) వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. 37 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రోడ్డు రెండేళ్లుగా ప్రమాదకరంగా మారింది.
తాత్కాలిక మరమ్మతులతో..
కోనసీమలోని కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం పరిధిలోని ప్రజలు,నేతలు, అధికారులు..నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ వేలవాహనాలు రావులపాలెం-అమలాపురం మధ్య తిరుగుతుంటాయి. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం పరిధిలో చాలాచోట్ల రోడ్డు పూర్తిగా(Ravulapalam to Amalapuram Road) ధ్వంసమైంది. రావులపాలెం-కొత్తపేట మధ్య ప్రయాణం అంటనే సాహసయాత్రలా మారింది. అధికారులు ఎప్పటికప్పుడు.. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఫలితంగా కొన్నిరోజులకే మళ్లీ గోతులు తేలుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.
రావులపాలెం - అమలాపురం రోడ్డును 2011లో సిద్ధం చేశారు. విస్తరించాలని నాలుగేళ్ల కిందటే నిర్ణయించినా.. ఇప్పటీకీ పనులు ప్రారంభం కాలేదు. గంటలకొద్దీ ప్రయాణంలో ఒళ్లు హూనం కావడం సహావాహనాలూ దెబ్బతింటున్నాయనే వాహనదారుల ఆవేదన ఎవరికీ పట్టడం లేదు. ఈ రహదారి పునర్నిర్మాణానికి ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. రూ.15 కోట్ల 90 లక్షల అంచనాతో తాజాగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారైనా కోనసీమ ప్రధాన రహదారికి మోక్షం లభిస్తుందా అని.. జనం ఎదురు చూస్తున్నారు.